Share News

Bhadrachalam: భద్రాద్రి ఆలయ ఈవోపై భూ ఆక్రమణదారుల దాడి

ABN , Publish Date - Jul 09 , 2025 | 05:23 AM

సీతారామచంద్రస్వామి ఆలయ భూముల ఆక్రమణ అంశం మరోసారి రణరంగాన్ని తలపించింది.

Bhadrachalam: భద్రాద్రి ఆలయ ఈవోపై భూ ఆక్రమణదారుల దాడి

  • స్పృహ కోల్పోయిన ఈవో, మరో ఉద్యోగి

  • ఏపీలోని పురుషోత్తపట్నంలో ఘటన

  • ఆలయ భూముల్ని కబ్జా చేస్తే పీడీ యాక్టు

  • మంత్రి కొండా సురేఖ హెచ్చరిక

  • రామాలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈవో, సిబ్బందిపై దౌర్జన్యం

  • ఏపీలోని పురుషోత్తపట్నంలో ఘటన

  • దాడిని ఖండించిన మంత్రి తుమ్మల

భద్రాచలం/హైదరాబాద్‌/ఎటపాక, జూలై 8 (ఆంధ్రజ్యోతి): సీతారామచంద్రస్వామి ఆలయ భూముల ఆక్రమణ అంశం మరోసారి రణరంగాన్ని తలపించింది. ఏపీలోని ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాద్రి రామయ్య భూముల్లో అక్రమార్కులు చేస్తున్న నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన దేవస్థానం ఈవో ఎల్‌.రమాదేవి, కాంట్రాక్టు ఉద్యోగి వినీల్‌తో పాటు మరికొందరు సిబ్బందిపై ఆక్రమణదారులు దాడి చేశారు. పురుషోత్తపట్నంలోని రాములోరి భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని తెలుసుకున్న ఆలయ అధికారులు సోమవారం వెళ్లి, అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆక్రమణదారులు దాడికి యత్నించడంతో వెనుదిరిగారు. రెండోరోజు మంగళవారం ఈవో రమాదేవి సిబ్బందితో కలిసి అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లారు. ‘నిర్మాణాలు ఆపేందుకు మీరెవరు?’ అంటూ దేవస్థానం అధికారులు, సిబ్బందిని ఆక్రమణదారులు, స్థానికులు ప్రశ్నించారు. ఈ భూములు భద్రాద్రి ఆలయానివని, తమ వద్ద అన్ని పత్రాలూ ఉన్నాయని ఈవో స్పష్టం చేశారు. ఈ సమయంలో అధికారుల చేతుల్లో ఉన్న పత్రాలను ఆక్రమణదారులు లాక్కున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. ‘మళ్లీ మా స్థలంలోకి ఎందుకొచ్చారు? వెళ్లిపోండి’ అంటూ ఆక్రమణదారులు ఆలయ అధికారులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అది కాస్తా తోపులాటకు దారితీసింది. అదే సమయంలో కొందరు ఈవో రమాదేవిపై దాడి చేశారు. ఆమె స్పృహ కోల్పోవడంతో భద్రాచలంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటనలో కాంట్రాక్టు ఉద్యోగి వినీల్‌ కూడా అస్వస్థతకు గురికావడంతో అతన్ని కూడా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ తోపులాటలో అక్రమంగా ఇంటిని నిర్మిస్తున్న పున్నమ్మ కూడా స్పృహ కోల్పోయింది. కాగా, అక్రమ నిర్మాణాలు అడ్డుకునేందుకు వెళ్లే సమయంలో ఎటపాక రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చినా సరిగా స్పందించలేదని ఆలయ అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క హెడ్‌ కానిస్టేబుల్‌ను పంపారని వాపోయారు. భద్రాచలం పోలీసులు కూడా ఎటపాక పోలీసులకు సమాచారం ఇచ్చారని, వారు స్పందించకపోవడంతోనే దాడి జరిగిందని అధికారులు ఆరోపిస్తున్నారు.


కబ్జా చేస్తే పీడీ యాక్టు

భద్రాద్రి రామాలయ ఈవో రమాదేవి, సిబ్బందిపై దాడిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. అధికారులపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. ఆలయ భూములు కబ్జా చేస్తే పీడీ యాక్టు నమోదు చేసి, జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఈవోను ఫోన్‌లో పరామర్శించారు. భద్రాద్రి రామయ్య భూముల సమస్యను పరిష్కరించాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరారు. ఈవోపై దాడిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. దాడిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆస్పత్రికి వెళ్లి ఈవో రమాదేవిని పరామర్శించారు. దాడిని అర్చక, ఉద్యోగ జేఏసీ ఖండించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జేఏసీ చైర్మన్‌ గంగు ఉపేంద్ర శర్మ కోరారు. కాగా, ఆలయ అధికారులు, సిబ్బందిపై ఆక్రమణదారులు దాడి చేసిన ఘటనపై రెండు రాష్ట్రాల్లోని పోలీసు నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. దాడి ఎలా జరిగిందనేదానిపై సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈవో రమాదేవి నుంచి కూడా వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. కాగా, ఈవోపై దాడికి సంబంధించి ఏఈవో రామకృష్ణారావు ఎటపాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొందరిపై కేసు నమోదు చేసినట్లు ఎటపాక సీఐ తెలిపారు.

ఈవోపై దాడి హేయమైన చర్య

ఈవో రమాదేవిపై దాడి చేయడం హేయమైన చర్య అని డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, మరో సంఘం నేత కె.చంద్రమోహన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి, క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు. ఈవో రమాదేవిపై జరిగిన దాడిని ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి ఖండించారు.

Updated Date - Jul 09 , 2025 | 05:23 AM