Share News

Sunny Yadav: యూట్యూబర్‌ సన్నీ యాదవ్‌ అరెస్ట్‌

ABN , Publish Date - May 30 , 2025 | 05:58 AM

తెలుగు వ్లాగర్‌/యూట్యూబర్‌ భయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. మోటార్‌ సైకిల్‌పై దేశవిదేశాల్లో పర్యటిస్తూ..

Sunny Yadav: యూట్యూబర్‌ సన్నీ యాదవ్‌ అరెస్ట్‌

  • చెన్నైలో అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ

  • బైక్‌పై అంతర్జాతీయ యాత్రలతో గుర్తింపు

  • బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌తో నోటీసులు

  • హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేక

  • దుబాయ్‌కి, అటు నుంచి పాకిస్థాన్‌కు సన్నీ!

హైదరాబాద్‌ సిటీ/నూతనకల్‌/చెన్నై, మే 29 (ఆంధ్రజ్యోతి): తెలుగు వ్లాగర్‌/యూట్యూబర్‌ భయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. మోటార్‌ సైకిల్‌పై దేశవిదేశాల్లో పర్యటిస్తూ.. వ్లాగింగ్‌(అక్కడి పరిస్థితులను వివరించే వీడియోలు చేయడం) చేసే సన్నీ.. ఇటీవల పాకిస్థాన్‌ను సందర్శించారు. దీంతో.. పాక్‌ సందర్శనకు గల కారణాలపై విచారణ జరిపేందుకు ఎన్‌ఐఏ అధికారులు అతణ్ని చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను చేపట్టిన నేపథ్యంలో ఉద్రిక్తతలు ఉన్నా.. సన్నీ పాకిస్థాన్‌కు వెళ్లడం వివాదాస్పదమైంది. భారత రహస్యాలను పాక్‌కు చేరవేస్తున్న యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా, మరో 11 మంది అరెస్టు తర్వాత.. ఈ తరహా వ్లాగర్లపై ఎన్‌ఐఏ నిఘా పెంచింది. ఈ క్రమంలో సన్నీతోపాటు.. మరో ముగ్గురు వ్లాగర్ల కదలికలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. సన్నీ యాదవ్‌ అసలు పాకిస్థాన్‌కు ఎందుకు వెళ్లాడు? ఉద్రిక్తతల తరుణంలో శత్రుదేశాన్ని సందర్శించడానికి కారణమేంటి? అనే కోణంలో అతణ్ని విచారించనున్నట్లు సమాచారం. కాగా.. బెట్టింగ్‌ యాప్స్‌కు ప్రచారం కల్పించిన కేసులోనూ సన్నీ నిందితుడిగా ఉన్నారు. పంజాగుట్ట కేసులో అతనికి నోటీసులు అందగా.. సూర్యాపేట పోలీసులు కూడా కేసు నమోదు చేశారు.


ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో అక్కడే?

సూర్యాపేట జిల్లా నూతన్‌కల్‌ మండల కేంద్రానికి చెందిన సన్నీ.. తనపై బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌ కేసు నమోదయ్యాక హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నించారు. అది కుదరకపోవడంతో దుబాయ్‌ వెళ్లారు. దాంతో లుకౌట్‌ నోటీసు జారీ అయ్యింది. సన్నీ దుబాయ్‌ నుంచి పాకిస్థాన్‌ వెళ్లినట్లు సమాచారం. భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను ప్రారంభించిన సమయంలోనూ అతను పాక్‌లోనే ఉన్నట్లు ఎన్‌ఐఏ వర్గాలు అనుమానిస్తున్నాయి. గతంలో కూడా అతను ఐదు సార్లు పాకిస్థాన్‌కు బైక్‌పై వెళ్లినట్లు తెలిసింది. సన్నీ తన పాకిస్థాన్‌ ట్రిప్‌పైనా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. అతని కుటుంబ సభ్యులు మాత్రం అరెస్టు వార్త తమకు తెలియదని, సన్నీ నిత్యం బైక్‌ యాత్రలు చేస్తుంటాడని తెలిపారు. టీవీల్లో చూశాకే తమకు సమాచారం తెలిసిందని చెప్పారు. కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ రిట్‌ వేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది.


సూర్యాపేట నుంచి ప్రస్థానం

సన్నీ పుట్టి పెరిగిందంతా సూర్యాపేట జిల్లా నూతన్‌కల్‌ మండలం శిల్పకుంట్ల గ్రామంలో. తండ్రి ఓ ఫార్మసీ స్టోర్‌ను నడుపుతున్నారు. తల్లి గృహిణి. సన్నీ సోదరుడు కల్యాణ్‌ కబడ్డీ ఆటగాడు. మధ్యతరగతి నుంచి వచ్చిన సన్నీ.. చదువుల్లో ఫర్వాలేదనిపించి, మోటార్‌ సైక్లింగ్‌లో దూసుకువెళ్లేవారు. 13 ఏళ్ల వయసు నుంచే వాహనాన్ని నడపడం నేర్చుకున్న సన్నీ.. 18వ ఏట డ్రైవింగ్‌ లైసెన్సు తీసుకుని, యమహాపై రయ్‌మంటూ ట్రిప్పులు వేసేవారు. 2016లో వ్లాగింగ్‌ మీద ఆసక్తి పెంచుకుని, ప్రయత్నాలను మొదలుపెట్టారు. మొదట్లో 100-150 కిలోమీటర్ల దూరాలతో ప్రయత్నించారు. యూట్యూబ్‌ వీక్షణలు పెద్దగా లేకపోవడంతో.. 2018 నుంచి పెద్ద ట్రిప్‌లను ప్లాన్‌ చేసేవారు. 2019లో 21 రోజుల్లో లద్దాఖ్‌కు వెళ్లిన యాత్ర, అతని జీవితాన్ని మార్చేసింది. ఆ యాత్రతో సబ్‌స్ర్కైబర్ల సంఖ్య ఒక్కసారిగా మూడు లక్షలకు చేరుకుంది. దాంతో.. పూర్తిస్థాయి వ్లాగర్‌గా మారిపోయారు. 2019లోనే నేపాల్‌కు వెళ్లి.. తొలి విదేశీ యాత్రను పూర్తిచేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఐదు వేల మందితో యోగాంధ్ర కార్యక్రమం

జగన్ సొంత జిల్లాలో టీడీపీ సైన్యం సత్తా..

For More AP News and Telugu News

Updated Date - May 30 , 2025 | 05:58 AM