Share News

Rain Predictions: మనోడు చెప్తే వాన పడాల్సిందే!

ABN , Publish Date - Jul 21 , 2025 | 04:28 AM

వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరికీ తెలియదంటారు. ప్రాణం సంగతేమో కానీ.. ఎక్స్‌లో ‘తెలంగాణ వెదర్‌మ్యాన్‌’ అనే ఖాతాను అనుసరించే వాళ్లకి వాన ఎప్పుడు పడుతుందనేది కచ్చితంగా తెలిసిపోతోంది.

Rain Predictions: మనోడు చెప్తే వాన పడాల్సిందే!

  • వాతావరణ అంచనాలతో ‘తెలంగాణ వెదర్‌మ్యాన్‌’గా అబ్బురపరుస్తున్న బాలాజీ తరణి

హైదరాబాద్‌ సిటీ, జూలై 20 (ఆంధ్రజ్యోతి): వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరికీ తెలియదంటారు. ప్రాణం సంగతేమో కానీ.. ఎక్స్‌లో ‘తెలంగాణ వెదర్‌మ్యాన్‌’ అనే ఖాతాను అనుసరించే వాళ్లకి వాన ఎప్పుడు పడుతుందనేది కచ్చితంగా తెలిసిపోతోంది. మరికాసేపట్లో ఫలానా ప్రాంతంలో వర్షం కురుస్తుందని ఆ ఖాతాలో పోస్టు వచ్చిందం టే అంతే.. చెప్పిన సమయానికి వర్షం పడుతుంది. తెలంగాణ వెదర్‌మ్యాన్‌ అంచనాలు అంతకచ్చితంగా ఉంటాయి. అందుకే సాధారణ ప్రజలతోపాటు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులు, విలేకరులు, సహా ఎంతోమంది ఆ ఖాతాను అనుసరిస్తున్నారు. తెలంగాణ వెదర్‌మ్యాన్‌ అంటే ఎవరో వాతావరణ శాఖ నిపుణు డు అనుకుంటే పొరపాటే. హైదరాబాద్‌కు చెందిన బాలాజీ తరణి అనే ఓ మామూలు కుర్రాడే తెలంగాణ వెదర్‌మ్యాన్‌. చదువుకుంది సివిల్‌ ఇంజనీరింగ్‌ అయినప్పటికీ వాతావరణ పరిశోధనపై ఉన్న ఆసక్తితో బాలా జీ ఈ పని చేస్తున్నారు. 90-92ు కచ్చితత్వంతో అంచనాలు ఇస్తున్నారు. ఆయన ఎక్స్‌ ఖాతాకు 1.42లక్షల మందికిపైగా ఫాలోయర్లు ఉన్నారు.


2020లో మొదలు..

జేఎన్‌టీయూలో ఈ ఏడాది సివి ల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన బాలాజీకి.. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే వాతావరణ అంచనాలు ముఖ్యంగా మేఘాల కదలికపై ఆసక్తి ఏర్పడింది. ఈ ఆసక్తితోనే ఓ ప్రత్యేక అల్గారిథమ్‌ రూపొందించుకున్న బాలాజీ.. వాతావరణాన్ని అంచనా వేయడం మొదలుపెట్టారు. తాను వేసిన అంచనాలు నిజం అవుతుండడంతో వాటిని అందరికీ తెలియజేసేందుకు సామాజిక మాధ్యమాలను ఎంచుకున్నారు. 2020 అక్టోబరులో ‘తెలంగాణ వెదర్‌మ్యాన్‌’ పేరిట ఎక్స్‌లో ఖాతాను ప్రారంభించి దానిలో తన అంచనాలను పోస్టు చేయడం ప్రారంభించారు. ఎక్స్‌టెండెడ్‌ ఫోర్‌కాస్ట్‌, మీడియం రేంజ్‌ ఫోర్‌కాస్ట్‌, షార్ట్‌రేంజ్‌ ఫోర్‌కాస్ట్‌ అని మూడు రకాలుగా బాలాజీ వాతావరణాన్ని అంచనా వేస్తుంటారు. ఈ అంచనాల కోసం వివిధ రకాల గణాంకాలు, ఉపగ్రహ చిత్రాలు, డాప్లర్‌ రాడార్‌ డాటా, క్లౌడ్‌ డాటా, మేఘా ల కదలికలు, ఆకృతులు విశ్లేషిస్తుంటారు. ఐఎండీ కంటే మెరుగ్గా వాతావరణ అంచనాలు ఇస్తున్నావని ఎవరైనా అంటే.. దానిని ఓ ప్రశంసగా మాత్రమే భావించే బాలాజీ.. సామాజిక బాధ్యతగానే తాను విశ్లేషణలు చేస్తున్నానని చెబుతుంటారు. ఇక, సొంతంగా మెషీన్‌ లెర్నింగ్‌ ద్వారా సృష్టించుకున్న అల్గారిథమ్‌తో వాతావరణ అంచనాలు వేస్తు న్న బాలాజీ.. ఉపగ్రహ చిత్రాలను మాత్రం కొన్ని అంతర్జాతీయ సంస్థల నుంచి సొంతంగా సమకూర్చుకున్న డబ్బుతో కొనుగోలు చేస్తుంటారు. పలు అంతర్జాతీయ సదస్సుల్లోనూ పర్యావరణం, వాతావరణంపై తన గొంతు వినిపించిన బాలాజీ.. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇదంతా సాధ్యమైందని చెబుతారు.


హైదరాబాద్‌లో భారీ వర్షాలు

రాబోయే 5-6 రోజుల్లో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలంగాణ వెదర్‌ మ్యాన్‌ బాలాజీ అంచనా వేశారు. వర్షపాత లోటు గతంలోనూ భారీ వర్షాల కారణంగానే భర్తీ అయిందని, ఈ సారి కూడా అదే కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. సగటు వర్షపాతం లేదంటే కాస్త అధికంగానే ఈసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఆగస్టు రెండో వారం తర్వాత, సెప్టెంబరులో వర్షాలు కురుస్తాయన్నారు. హైదరాబాద్‌తోపాటు మిగిలిన జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని బాలాజీ అంచనా వేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక, టీవీ చానల్‌

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 04:28 AM