Share News

Organ Donation: అవయవ దానంలో తెలంగాణ టాప్‌

ABN , Publish Date - Aug 04 , 2025 | 04:56 AM

అవయవ దానంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 2024లో ప్రతి పది లక్షల జనాభాకు దేశంలో సగటున 0.8 అవయవ దానాలు జరిగితే, రాష్ట్రంలో 4.88 జరిగాయని కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించింది.

Organ Donation: అవయవ దానంలో తెలంగాణ టాప్‌

  • గత ఏడాది 188 మంది నుంచి అవయవాల సేకరణ

  • జీవన్‌దాన్‌కు అవార్డు అందజేసిన కేంద్ర మంత్రి నడ్డా

హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): అవయవ దానంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 2024లో ప్రతి పది లక్షల జనాభాకు దేశంలో సగటున 0.8 అవయవ దానాలు జరిగితే, రాష్ట్రంలో 4.88 జరిగాయని కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించింది. అవయవ దానంలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు గానూ తెలంగాణకు నేషనల్‌ ఆర్గాన్‌ అండ్‌ టిష్యు ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆర్గనైజేషన్‌ (నోట్టో) అవార్డు ప్రకటించింది. జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలంగాణ జీవన్‌దాన్‌ ప్రతినిధులకు ఈ అవార్డును అందజేశారు.


అవయవ దానంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం పట్ల రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. బ్రెయిన్‌ డెత్‌ కేసుల్లో అవయవాలు వృథా పోకుండా, దానం చేయాలని ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ కింద అవయవ మార్పిడి చికిత్సను ఉచితంగా అందిస్తున్నామన్నారు. 2024లో 188 మంది బ్రెయిన్‌ డెత్‌ డోనర్ల నుంచి 725 అవయవాలను సేకరించామని, వాటిని అవసరమైన వారికి అమర్చి వారి ప్రాణాలు కాపాడగలిగామని మంత్రి వెల్లడించారు.

Updated Date - Aug 04 , 2025 | 04:56 AM