Bhatti Vikramarka: ఇంధన రంగంలో రాష్ట్రాలు సహకరించుకోవాలి
ABN , Publish Date - Apr 23 , 2025 | 05:13 AM
రాష్ట్రాల మధ్య ఇంధన రంగంలో సహకారం కీలకమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ-రాజస్థాన్ మధ్య 3100 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందం విజయవంతంగా జరిగింది.

తెలంగాణ-రాజస్థాన్ మధ్య ఒప్పందం సుపరిణామం : భట్టి
హైదరాబాద్, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): దేశంలో ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అత్యంత కీలకమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి, రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్(ఆర్‌వీయూఎన్‌ఎల్) మధ్య 3100 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందం జరగడం మంచి పరిణామమని తెలిపారు. తెలంగాణ-రాజస్థాన్ మధ్య కుదిరిన సోలార్, థర్మల్ విద్యుత్ ఒప్పందాలను ముందుకు తీసుకువెళ్లేందుకు భట్టి, రాజస్థాన్ విద్యుత్ శాఖ మంత్రి హీరాలాల్ నగర్ భేటీ అయ్యారు. తెలంగాణ, రాజస్థాన్ ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగిన ఒప్పందం సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనమని భట్టి అన్నారు.
ఒప్పందంలో భాగంగా తెలంగాణలో నెలకొల్పనున్న 1600 మెగావాట్ల థర్మల్ ప్లాంట్లలో ఒకటైన సింగరేణి 800 మెగావాట్ల అలా్ట్ర సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ పనులకు మే రెండో వారంలో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక 3100 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇరు కంపెనీలు సంయుక్త భాగస్వామ్య కంపెనీని నెలకొల్పడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే రాజస్థాన్‌లో ఏర్పాటు చేయనున్న 1500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల కోసం భూ పరిశీలన పూర్తయిందని, మరోసారి అధికారుల బృందం అక్కడికి వెళ్లి ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఇరు రాష్ట్రాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టుపై మంచి పురోగతి ఉండటంపై రాజస్థాన్ విద్యుత్ శాఖ మంత్రి హీరాలాల్ నగర్ సంతృప్తి వ్యక్తం చేశారు.