తెలంగాణ పోలీసులు ‘వెరీ ఫాస్ట్’ !
ABN , Publish Date - Jun 24 , 2025 | 04:05 AM
పాస్‌పోర్టు దరఖాస్తుల పోలీసు ధ్రువీకరణ ప్రక్రియలో తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యుత్తమ పనితీరుతో అగ్రస్థానంలో నిలిచారు.

పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలనలో స్పీడ్
అత్యుత్తమ పని తీరుతో దేశంలో అగ్రస్థానం
నేడు ఢిల్లీలో అవార్డు అందుకోనున్న ఇంటెలిజెన్స్ చీఫ్
హైదరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): పాస్‌పోర్టు దరఖాస్తుల పోలీసు ధ్రువీకరణ ప్రక్రియలో తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యుత్తమ పనితీరుతో అగ్రస్థానంలో నిలిచారు. పాస్ పోర్టు దరఖాస్తుల పరిశీలన కోసం రాష్ట్ర పోలీసులు అభివృద్ధి చేసిన ‘వెరీ ఫాస్ట్’ యాప్ ప్రధాన కారణంగా నిలిచింది. రాష్ట్ర పోలీసుల పనితీరును గుర్తించిన కేంద్రం అవార్డు ప్రకటించింది. న్యూఢిల్లీలో మంగళవారం నిర్వహిస్తున్న పాస్‌పోర్టు సేవా దివ్‌సలో విదేశాంగ శాఖ మంత్రి చేతుల మీదుగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి అవార్డు అందుకోనున్నారు.
కాగా, వెరీ ఫాస్ట్ యాప్ పాస్‌పోర్టు దరఖాస్తు ధ్రువీకరణ ప్రక్రియను వేగవంతంగా, ఖచ్చితంగా, పారదర్శకంగా నిర్వహించడంలో పోలీసులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. రాష్ట్ర పోలీసులు దేశంలోనే అత్యంత వేగంగా పాస్‌పోర్టు దరఖాస్తుల ధ్రువీకరణ పూర్తి చేస్తున్నారు. పోలీస్ వెరిఫికేషన్ తీరుపట్ల 95ుపైగా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. రోజుకు సగటున 2 వేలకుపైగా పాస్‌పోర్టు ధ్రువీకరణలు, వార్షికంగా 8 లక్షలకు పైగా పూర్తి చేస్తున్నారు.