Share News

Opium Seizure: రాజస్థాన్‌ నుంచి నల్లమందు.. 3.5 కిలోల పట్టివేత

ABN , Publish Date - Jul 19 , 2025 | 04:42 AM

రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌కు నల్లమందు తరలించే బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ఆటను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ వింగ్‌- ఈగల్‌ కట్టించింది. ఈ ముఠా నుంచి రూ. 17 లక్షలు విలువ చేసే 3.5 కిలోల ఒపియంను సీజ్‌ చేసింది.

Opium Seizure: రాజస్థాన్‌ నుంచి నల్లమందు.. 3.5 కిలోల పట్టివేత

హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌కు నల్లమందు తరలించే బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ఆటను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ వింగ్‌- ఈగల్‌ కట్టించింది. ఈ ముఠా నుంచి రూ. 17 లక్షలు విలువ చేసే 3.5 కిలోల ఒపియంను సీజ్‌ చేసింది. ఈగల్‌ చీఫ్‌ సందీప్‌ శాండిల్య కథనం ప్రకారం.. ఈ నెల 14న రాజస్థాన్‌లోని జాలోర్‌ జిల్లా బిన్మల్‌ ప్రాంతానికిచెందిన సావ్లారామ్‌ బిష్ణోయ్‌ ముఠా.. కార్లలో నల్లమందుతో హైదరాబాద్‌కు బయలుదేరింది. ముందే ఉప్పందుకున్న ఈగల్‌ బృందం.. నిఘాను ముమ్మరం చేసింది. ఆదిలాబాద్‌ టోల్‌ప్లాజా వద్ద ఓ కారుకు ముందు పైలటింగ్‌, వెనక ఎస్కార్టింగ్‌గా వాహనాలు వెళ్తుండడాన్ని గుర్తించింది.


ముందున్న కారులోని వ్యక్తి.. వెనక కార్లకు సిగ్నల్‌ ఇవ్వడాన్ని గమనించింది. ఆ వాహనాలను హైదరాబాద్‌ వచ్చే వరకు ఈగల్‌ బృందాలు గుట్టుచప్పుడు కాకుండా వెంబడించాయి. బిష్ణోయ్‌ గ్యాంగ్‌ కారు గురువారం హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చేరుకుని, ఓ వ్యక్తికి నల్లమందును అందిస్తుండగా.. ఈగల్‌ బృందాలు దాడులు జరిపాయి. పైలటింగ్‌ చేస్తున్న వాహనంతోపాటు.. మరో కారును సీజ్‌ చేశాయి. ఆ కారులో 3.5 కిలోల నల్లమందును స్వాధీనం చేసుకున్నాయి. ఈ గ్యాంగ్‌ నాయకుడు సావ్లారామ్‌ బిష్ణోయ్‌ అని గుర్తించామని సందీప్‌ శాండిల్య తెలిపారు. హపురాం బిష్ణోయ్‌, లాలారామ్‌ బిష్ణోయ్‌ అనే వ్యక్తులను అరెస్టు చేసి, రెండు కార్లు, 3.5 కిలోల నల్లమందును సీజ్‌ చేశామన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 04:42 AM