Banakacharla Project: ఎజెండాలో బనకచర్ల వద్దు
ABN , Publish Date - Jul 16 , 2025 | 04:26 AM
తెలుగు రాష్ట్రాల జలవివాదాలపై చర్చించేందుకుగాను కేంద్ర జలశక్తి శాఖ బుధవారం ఢిల్లీలో నిర్వహించనున్న సమావేశపు ఎజెండాలో గోదావరి బనకచర్ల ప్రాజెక్టును చేర్చడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

సీఎంల భేటీ ఎజెండాపై తెలంగాణ అభ్యంతరం
చర్చించే అంశాలను సవరించాలని కేంద్రానికి లేఖ
జీఆర్‌ఎంబీ, సీడబ్ల్యూసీ, పీపీఏ అభ్యంతరాల ప్రస్తావన
చర్చించే అంశాల చిట్టాను సవరించాలని కేంద్రానికి లేఖ
హైదరాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల జలవివాదాలపై చర్చించేందుకుగాను కేంద్ర జలశక్తి శాఖ బుధవారం ఢిల్లీలో నిర్వహించనున్న సమావేశపు ఎజెండాలో గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును చేర్చడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం లేఖ రాశారు. తక్షణమే ఎజెండాను సవరించాలని కోరారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పదే పదే అభ్యంతరం తెలుపుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ‘‘గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ప్రాఽథమిక సాధ్యాసాధ్యాల నివేదికను తిరస్కరించాలని సీడబ్ల్యూసీని కోరుతున్నాం. తదుపరి డీపీఆర్ దాఖలు చేయకుండా నియంత్రించాలని, టెండర్లు చేపట్టకుండా అడ్డుకోవాలని కోరుతున్నాం. ఈ ప్రాజెక్టుకు చట్టబద్ధమైన అనుమతులు లభించకుండా ఏ వేదికలోనూ చర్చించడానికి వీల్లేదు. ట్రైబ్యునల్ అవార్డులు, చట్ట పరిమితులకు లోబడి అంతర్రాష్ట్ర సంప్రదింపులు, అభ్యంతరాలన్నీ పూర్తి స్థాయిలో పరిష్కారమయ్యే దాకా దీన్ని ముట్టుకోరాదు’’ అని లేఖలో సీఎస్ పేర్కొన్నారు. ప్రాజెక్టుపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ), కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) లేవనెత్తిన అభ్యంతరాలను కూడా లేఖలో పొందుపరిచారు.
తెలంగాణ తెలిపిన అభ్యంతరాలు
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు 1980లో గోదావరి ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకం. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం.. రాష్ట్రాల సమ్మతి లేకుండా, సంప్రదింపులు లేకుండా ప్రాజెక్టుకు ప్రతిపాదించిన నీటి కేటాయింపులు, ప్రాజెక్టు నిర్వహణ బేసిన్‌ను పంచుకునే రాష్ట్రాలకు వ్యతిరేకం.
ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ చట్టబద్ధంగా క్లియరెన్స్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. గోదావరి, కృష్ణా యాజమాన్య బోర్డులు డీపీఆర్‌ను పరిశీలించాల్సి ఉంటుంది. ఇవేవీ ఈ ప్రాజెక్టుకు లేవు.
ఈ ప్రాజెక్టు కోసం సమర్పించిన ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక (పీఎ్‌ఫఆర్)లో కీలక సమాచార లోపాలున్నాయి. నీటి లభ్యత, సాంకే తిక సమాచారం లోపించింది.
పర్యావరణ అనుమతులకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా విచారణ విధి విధానాలు జారీ చేయాలని ఏపీ కోరగా... కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖకు చెందిన నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ప్రాజెక్టు ప్రతిపాదనలను తిప్పిపంపింది.
పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల నీటి తరలింపు అనేది ఏకపక్షం. ఇది పోలవరం ప్రాజెక్టు ఆపరేషన్ షెడ్యూల్‌కు పూర్తిగా వ్యతిరేకం. తెలంగాణ నీటి హక్కులను ప్రభావితం చేస్తుంది.
పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ముంపు సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. ఇది కోర్టు విచారణలో ఉంది. ఈ సమయంలో నీటి మళ్లింపు అనుసంధానం సరైంది కాదు.
గోదావరి జలాలపై తెలంగాణకు చట్టబద్ధమైన హక్కు, కరువు పీడిత ప్రాంతాలకు నీటి తరలింపుపై దీని ప్రభావం ఉంటుంది. అంతర్రాష్ట్ర నదీ జలాల్లో సమాన నీటి వాటాకు వ్యతిరేకం.
ట్రైబ్యునల్ అవార్డులు, అంతర్రాష్ట్ర నీటి ఒప్పందాలకు వ్యతిరేకంగా గోదావరి-బనకచర్ల ఉంది. పోలవరం నుంచి 80 టీఎంసీలను కృష్ణా డెల్టాకు తరలించే వాటాలో నదీ పరివాహకాన్ని పంచుకునే రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు ఇంకా తేలలేదు.