Telangana MLC: రాములమ్మకు భలే ఛాన్స్.. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు వీళ్లే..
ABN , Publish Date - Mar 09 , 2025 | 06:57 PM
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ ఖరారు చేసింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఏఐసీసీ ప్రకటించింది. ముఖ్యంగా విజయశాంతి పేరును ఖరారు చేయడం ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు ఎవరో ఎట్టకేలకు తేలింది. నామినేషన్ల గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు కాంగ్రెస్ అధిష్టానం ముగ్గరు పేర్లను ప్రకటించింది. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకుగానూ ప్రస్తుతం శాసనసభలో సంఖ్యా బలం ప్రకారం అధికారపక్షానికి నాలుగు సీట్లు గెలుచుకునే అవకాశం ఉండగా.. మరొకటి ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు దక్కనుంది. కాంగ్రెస్ మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మిత్రపక్షం సీపీఐకి ఒకస్థానాన్ని కేటాయించింది. దీంతో కాంగ్రెస్ తమ ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అనూహ్యంగా ఈజాబితాలో ఒకటి నుంచి రెండు పేర్లు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉంటాయనే చర్చ జరిగినప్పటికీ చివరకు రెడ్డి సామాజికవర్గం నుంచి ఎవరికి అవకాశం దక్కలేదు. అనూహ్యంగా నటి విజయశాంతి పేరును కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ప్రకటించింది. అలాగే అద్దంకి దయాకర్, శంకర్ నాయక్‌ను తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కాంగ్రెస్ ప్రకటించింది.
విజయశాంతికి ఎమ్మెల్సీ..
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జిగా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత విజయశాంతి గురించి వాకబు చేశారని, ప్రస్తుతం ఆమె ఎందుకు పార్టీకి దూరంగా ఉంటున్నారని ఆరా తీసినట్లు తెలుస్తోంది. మీనాక్షి నాటరాజన్ విజయశాంతి పేరును ఎమ్మెల్సీ కోసం ప్రతిపాదించినట్లు చర్చ జరుగుతోంది. మీనాక్షి నటరాజన్ ఇన్‌ఛార్జి బాధ్యతలు తీసుకుని తెలంగాణలో పర్యటిస్తున్న నేపథ్యంలో విజయశాంతి పేరు కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో ఆమె పేరు కనిపించింది.
ఏకంగా ఎనిమిదిసార్లు
విజయశాంతి గతంలో మెదక్ ఎంపీగా పనిచేశారు. బీజేపీ ద్వారా 1998లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆమె 2009లో తల్లి తెలంగాణ పేరిట పార్టీని ప్రారంభించారు. ఆ తర్వాత అదే సంవత్సరం ఆమె పార్టీని అప్పటి టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. 2010లో టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. అదే సంవత్సరం మరోసారి టీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. 2014లో మరోసారి కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి 2020లో బీజేపీలో చేరారు. 2023 శాసనసభ ఎన్నికలముందు తనకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడంలేదంటూ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎన్నికల వేళ ప్రచారసభల్లో పాల్గొన్న ఆమె పార్లమెంట్ ఎన్నికల తర్వాత నుంచి కొంచెం సైలెంట్ అయ్యారు. తాజాగా ఆమెను కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీగా ప్రకటించింది. దీంతో సోమవారం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానం కోసం విజయశాంతి నామినేషన్ దాఖలు చేస్తారు.
అద్దంకిని వరించిన అదృష్టం..
ఎట్టకేలకు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్‌ను అదృష్టం వరించింది. ఎప్పటినుంచో ఆయనకు పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతున్నా ఎప్పటికప్పుడు వెనక్కి వెళ్తూ వస్తోంది. తెలంగాణ ఉద్యమకాలంలో కీలకంగా పనిచేసిన అద్దంకి దయాకర్ కాంగ్రెస్‌లో చేరారు. అప్పటినుంచి ఇప్పటివరకు పదవులతో సంబంధం లేకుండా ఒకేపార్టీ జెండా మోస్తూ వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశించారు. వచ్చినట్లే వచ్చి చివరకు టికెట్ దక్కలేదు. అయినప్పటికీ తన అసంతృప్తిని ఎక్కడా దయాకర్ బయటకు చూపించలేదు. తన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ ఇవ్వాలని గతంలో ఎన్నోసార్లు డిమాండ్ చేసినా, వచ్చినట్లే వచ్చి పదవి చేజారిపోయిన సందర్భాలున్నాయి. తాజాగా ఎలాగైనా దయాకర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది.
ఇవి కూడా చదవండి
BRS:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ పేరు పరిశీలన..
TG Assembly: 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
AICC: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఎలా అంటే..
మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here