Share News

పార్లమెంటుకు హాజరులో చామల ఫస్ట్‌

ABN , Publish Date - Apr 17 , 2025 | 04:29 AM

తెలంగాణ నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఎంపీలు పార్లమెంటుకు హాజరవుతున్న తీరు, సభలో వారు లేవనెత్తుతున్న ప్రశ్నలు, చర్చల్లో పాల్గొనడంపై ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి.

పార్లమెంటుకు హాజరులో చామల ఫస్ట్‌

  • ఎంపీగా ఎన్నికైన దగ్గర్నుంచి వంద శాతం హాజరు

  • రాష్ట్రం నుంచి తర్వాతి స్థానంలో రఘునందన్‌రావు

  • ప్రశ్నలు వేయడంలో ఈటల.. చర్చల్లో ఒవైసీ టాప్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఎంపీలు పార్లమెంటుకు హాజరవుతున్న తీరు, సభలో వారు లేవనెత్తుతున్న ప్రశ్నలు, చర్చల్లో పాల్గొనడంపై ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటిదాకా జరిగిన పార్లమెంటు సమావేశాల్లో పూర్తి స్థాయిలో పాల్గొని.. వంద శాతం హాజరుతో మొదటి స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు 97.05 శాతం హాజరుతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌.. పార్లమెంటులో అందరికంటే ఎక్కువగా 80 ప్రశ్నలు లేవెనెత్తి చురుకైన పార్లమెంటేరియన్‌గా నిలిచారు.


చర్చల్లో పాల్గొనడంలో హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ (21 చర్చలు) మొదటి స్థానంలో ఉన్నారు. అయితే 79 ప్రశ్నలు, 17 చర్చల్లో పాల్గొన్న చామల ఈ రెండు విషయాల్లోనూ రెండో స్థానంలో నిలిచారు. ఈటల రాజేందర్‌ 9 చర్చల్లో పాల్గొన్నారు. కాగా, రఘునందన్‌రావు 46 ప్రశ్నలు అడిగి, ఏడు చర్చలకు హాజరయ్యారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 95.58 శాతం లోక్‌సభ సమావేశాలకు హాజరయి, 18 ప్రశ్నలను లేవనెత్తి, ఆరు చర్చలలో పాల్గొన్నారు. కాగా, నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి అతితక్కువ హాజరు, చర్చలు, ప్రశ్నలతో చివరిస్థానంలో నిలిచారు. ఆయన హాజరు శాతం కేవలం 72.05 శాతం మాత్రమే ఉంది. ఇప్పటివరకు 8 ప్రశ్నలు మాత్రమే అడిగారు. ఒక్క చర్చలో కూడా మాట్లాడలేదు.

Updated Date - Apr 17 , 2025 | 04:29 AM