Share News

Seethakka: 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌

ABN , Publish Date - Aug 03 , 2025 | 05:18 AM

సరైన సమయానికి హాజరు కాకుండా, పాత ఫొటోలే ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌లో పంచాయతీ కార్యదర్శులు పోస్టు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి సీతక్క తీవ్రంగా స్పందించారు.

Seethakka: 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌

  • ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌లో తప్పుడు అటెండెన్స్‌ కారణం

  • విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించొద్దు

  • పంచాయతీ రాజ్‌ అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం

హైదరాబాద్‌/ వనపర్తి/గద్వాల క్రైం/నాగర్‌కర్నూల్‌ టౌన్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): సరైన సమయానికి హాజరు కాకుండా, పాత ఫొటోలే ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌లో పంచాయతీ కార్యదర్శులు పోస్టు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి సీతక్క తీవ్రంగా స్పందించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడాన్ని ఉపేక్షించవద్దని హెచ్చరించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విచారించిన ఆ శాఖ ఉన్నతాధికారులు పాత ఫొటోలు పోస్టు చేసిన 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ‘ఫేస్‌ రిక్నగిషన్‌ యాప్‌’తో ఉద్యోగుల హాజరు ప్రక్రియ కొనసాగుతుంది.


అయితతే, 2 రోజుల క్రితం ఓ జిల్లాలోని పంచాయతీ కార్యదర్శి.. సీఎం రేవంత్‌ రెడ్డి ఫొటో అప్‌లోడ్‌ చేసిన విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఉన్నతాధికారులు శనివారం చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా విచారణలో 553 మంది పంచాయతీ కార్యదర్శులు అనుమానాస్పదంగా ఫేక్‌ అటెండెన్స్‌ వేస్తున్నట్లు గుర్తించారు. ఔట్‌ సోర్సింగ్‌ విభాగంలో పని చేస్తున్న ఓ పంచాయతీ కార్యదర్శిని సర్వీసు నుంచి తొలగించారు. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో పది మందితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 15 మందిని సస్పెండ్‌ చేశారు. మిగతా వారితోపాటు విధుల నిర్వహణలో అశ్రద్ధగా ఉన్న 47 మంది ఎంపీఓలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. వారిపై శాఖ పరంగా చర్యలకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

Updated Date - Aug 03 , 2025 | 05:18 AM