గచ్చిబౌలిలో గజం రూ.2.22 లక్షలు!
ABN , Publish Date - Jun 24 , 2025 | 04:50 AM
గ్రేటర్ పరిధిలో ఉన్న తెలంగాణ హౌసింగ్ బోర్డు స్థలాల వేలంలో ఆశించిన స్థాయిలో ధరలు పలకలేదు. ఇటీవల కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని ఓ స్థలానికి గజం ధర రూ.2.98 లక్షలు పలికిన సంగతి తెలిసిందే.

కేపీహెచ్‌బీతో పోలిస్తే ధర తక్కువే
హౌసింగ్ బోర్డు స్థలాల వేలం పాట
బోర్డుకు రూ.65 కోట్ల ఆదాయం
హైదరాబాద్ సిటీ, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ పరిధిలో ఉన్న తెలంగాణ హౌసింగ్ బోర్డు స్థలాల వేలంలో ఆశించిన స్థాయిలో ధరలు పలకలేదు. ఇటీవల కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని ఓ స్థలానికి గజం ధర రూ.2.98 లక్షలు పలికిన సంగతి తెలిసిందే. సోమవారం హౌసింగ్ బోర్డు నిర్వహించిన వేలంలో ఐటీ కారిడార్‌లోని ప్రధాన ప్రాంతమైన గచ్చిబౌలిలో గజం ధర అత్యధికంగా రూ.2.22 లక్షలు పలకగా.. అత్యల్పంగా రూ.1.12 లక్షలు పలికింది. గచ్చిబౌలిలో 4 ప్లాట్లను అమ్మకానికి పెట్టగా, అన్నీ కొనుగోలు చేశారు. అలాగే చింతల్‌లో 10 ప్లాట్లను అమ్మకానికి పెడితే కేవలం 3 ప్లాట్లనే కొనుగోలు చేశారు. చింతల్‌లో హౌసింగ్ బోర్డు అధికారులు గజం ధరను రూ.80 వేలకు నిర్ణయిస్తే వేలంలో అత్యధికంగా రూ.1.14 లక్షలు పలకగా, అత్యల్పంగా రూ.86 వేల ధర పలికింది.
ఇక నిజాంపేటలోని అపార్ట్‌మెంట్లలో 413.43 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉన్న 8 ఫ్లాట్లను వేలంలో ఉంచగా, కేవలం 4 ఫ్లాట్లు మాత్రమే కొనుగోలు చేశారు. నిజాంపేటలో ఒక్కో ఫ్లాట్ ధరను హౌసింగ్ బోర్డు అధికారులు రూ.16.55 లక్షలుగా నిర్ణయిస్తే, అత్యధికంగా ఒక ఫ్లాట్‌కు రూ.18.21 లక్షలు పలికింది. అత్యల్పంగా రూ.16.73 లక్షలు పలికిందని తెలిపారు. చింతల్‌లో 10 ఖాళీ స్థలాలకు గాను కేవలం 3 స్థలాలనే కొనుగోలు చేశారు. ప్లాట్లు, ఫ్లాట్ల వేలం ద్వారా మొత్తం రూ.65,01,91,176 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో గచ్చిబౌలిలో 3271 గజాలు, చింతల్‌లో 799 గజాలు, నిజాంపేటలో 4 ఫ్లాట్ల విక్రయించినట్లు వివరించారు. గచ్చిబౌలిలో గజానికి సగటు ధర రూ.1.63 లక్షలు, చింతల్‌లో గజానికి రూ.1.01 లక్షలు వచ్చిందని తెలిపారు. మొత్తం 22 ఆస్తులను వేలం వేయగా.. 11 మాత్రమే కొనుగోలు చేశారు.