Share News

Group 1 Recruitment Stay: గ్రూప్‌-1పై బ్రేక్‌

ABN , Publish Date - Apr 18 , 2025 | 04:51 AM

గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతానికి నియామక పత్రాలు ఇవ్వొద్దని, సర్టిఫికెట్ల తనిఖీ కొనసాగించవచ్చని పేర్కొంది

Group 1 Recruitment Stay: గ్రూప్‌-1పై బ్రేక్‌

  • ప్రస్తుతానికి నియామక పత్రాలు ఇవ్వొద్దు

  • సర్టిఫికెట్ల తనిఖీ కొనసాగించవచ్చు: హైకోర్టు

  • మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ

  • దాఖలైన పిటిషన్‌పై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 నియామకాల విషయంలో హైకోర్టు గురువారం కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతానికి నియామక పత్రాలు జారీచేయరాదని.. సర్టిఫికెట్ల తనిఖీప్రక్రియను యథాతథంగా కొనసాగించవచ్చని పేర్కొంది. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల సమాధానపత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని.. దీనిపై న్యాయవిచారణకు ఆదేశించాలని కోరుతూ భువనగిరికి చెందిన మట్ట పరమేశ్‌, మరో 19 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. హైదరాబాద్‌లో కేవలం రెండు కేంద్రాల నుంచి పరీక్ష రాసిన 71 మంది ఉద్యోగాలకు ఎంపిక కావడం అనుమానాస్పదంగా ఉందని.. పిటిషనర్ల సమాఽధాన పత్రాలను సరిగా మూల్యాంకనం చేయలేదని, జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను తప్పుగా ప్రచురించారని ఆమె ఆరోపించారు. దీనిపై కోర్టు పర్యవేక్షణలో విచారణకు ఆదేశించాలని లేదా స్వతంత్ర న్యాయవిచారణకు కమిషన్‌ వేయాలని కోరారు. ‘‘హైదరాబాద్‌లోని రెండు సెంటర్ల నుంచి 71 మంది ఎంపికయ్యారు. మొత్తం 563 పోస్టుల్లో ఇది 12 శాతానికి సమానం. మెయిన్స్‌ పరీక్షలకు 21,075 మంది ఎంపికయ్యారని ఒకసారి.. 21,085 మంది ఎంపికైనట్టు మరోసారి చెప్పారు. ఆ 10 మందీ ఎలా పెరిగారు? ఉర్దూలో 9 మంది పరీక్షలు రాస్తే 10 మంది అని వెల్లడించారు. 482 మార్కులు వచ్చిన ఓ అభ్యర్థి రీకౌంటింగ్‌ పెడితే 60మార్కులు తగ్గడం దారుణం. జనరల్‌ ర్యాంకింగ్స్‌ను కంప్యూటర్‌లో మార్చారు. కంప్యూటర్‌ లాగిన్‌హిస్టరీని పరిశీలిస్తే నిజాలు బయటకొస్తాయి. దీనిపై వివరాలు అడితే ఫోర్జరీ అని బెదిరిస్తున్నారు. విషయ నిపుణులతో పేపర్లు మూల్యాంకనం చేయించామని అంటున్నారుగానీ.. రిటైర్‌ అయిన వారితో పేపర్లు దిద్దించారు. వీటన్నింటిపై విచారణకు ఆదేశించాలి’’ అని ఆమె విజ్ఞప్తి చేశారు.


కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు..

టీజీపీఎస్సీ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది పీఎస్‌ రాజశేఖర్‌.. మెయిన్స్‌కు ఎంపికైన వారంతా ఒకే ప్రాంతానికి చెందిన వారని చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. ‘‘అక్టోబరు 27న మెయిన్స్‌ చివరి పరీక్ష జరిగిన రోజు సమాచారాన్ని బట్టి మొత్తం అభ్యర్థులు 21,075గా కమిషన్‌ ప్రకటించింది. అందులో స్వల్ప మార్పులు ఉంటాయని సైతం ముందే తెలిపారు. ఆ తర్వాత మొత్తం సంఖ్య 21,085గా తేలింది. చివరి పరీక్ష రోజు మొత్తం అభ్యర్థుల సంఖ్యను కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. రెండు సెంటర్ల నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు ఎంపికయ్యారన్న దానిలో వాస్తవం లేదు. పిటిషనర్లు ఆరోపిస్తున్న ఒక సెంటర్‌లో 792 మందికి 39 మంది (4.92శాతం) మరో సెంటర్‌లో 864 మందికి 32 మంది (3.7శాతం) మాత్రమే ఎంపికయ్యారు. హాజరైన అభ్యర్థులతో పోలిస్తే ఎంపిక శాతం చాలా తక్కువగా ఉంది. అవకతవకలు జరిగి ఉంటే అందరూ ఎంపిక కావాలి. లేదా ఆ సెంటర్లలో మిగిలిన అభ్యర్థులు అభ్యంతరం తెలిపేవారు. ఆయా సెంటర్లు మహిళా కాలేజీలు కావడం వల్ల అక్కడ మహిళా అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారు. మెయిన్స్‌కు 45 సెంటర్లను తొలుత ప్రకటించినా ఒక సెంటర్‌ పెంచాల్సి వచ్చింది. అన్ని కేంద్రాలనూ ఎంపిక చేసిన తర్వాతే హాల్‌టికెట్లు జారీచేశాం’’ అని ధర్మాసనానికి వివరించారు. మూల్యాంకనంలో పాల్గొన్న ఎంఏ మల్లిక్‌ ఆర్సీరెడ్డి కోచింగ్‌ సెంటర్‌లో పని చేస్తున్నారనే ఆరోపణ అవాస్తవమని.. ఆయన చేవెళ్ల డిగ్రీ కాలేజీలో ప్రభుత్వ ఉద్యోగి అని తెలిపారు.


విశ్రాంత ఉద్యోగులను మూల్యాంకనం చేయడానికి తీసుకోవద్దని చట్టంలో లేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ వేసిన 20 మందిలో 19 మంది ప్రభుత్వ ఉద్యోగులని.. వారు ఎక్కడ పనిచేస్తున్నారు? అనే వివరాలు దాచిపెట్టి తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ధర్మాసనానికి నివేదించారు. ‘‘రీకౌంటింగ్‌లో మార్కులు తగ్గాయన్న మాట అవాస్తవం. సదరు అభ్యర్థికి 422మార్కులు వస్తే 482 అని ఫోర్జరీ చేశారు’’ అని పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలూ విన్న ధర్మాసనం.. అభ్యర్థుల డేటా నమోదు హిస్టరీతోపాటు పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీచేసింది. పిటిషనర్లు సైతం తాము ఎక్కడ పనిచేస్తున్నదీ వివరాలు సమర్పించాలని ఆదేశించింది. తప్పుడు వివరాలు ఇచ్చినట్లు తేలితే చర్యలుంటాయని హెచ్చరిస్తూ.. తదుపరి విచారణను ఈనెల 28కి వాయుదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

తరగతి గదిలో పెచ్చులూడి పడి..

ప్రైవేట్‌ ఆస్పత్రి పొమ్మంటే.. సర్కారు దవాఖానా ప్రాణాలు నిలిపింది

దుబాయిలో అసలేం జరిగింది..?

తెలంగాణ పోలీసులకు సీఎం అభినందనలు

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 18 , 2025 | 04:51 AM