Hyderabad: కేఏ పాల్ గ్లోబల్ పీస్ ఫెస్టివల్‌కు హైకోర్టు అనుమతి
ABN , Publish Date - May 24 , 2025 | 03:28 AM
ప్రపంచశాంతి సంస్థ, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నేతృత్వంలో వరల్డ్ పీస్ ఫెస్టివల్ సువార్త సభలకు పలు షరతులతో హైకోర్టు అనుమతి మంజూరు చేసింది.

హైదరాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): ప్రపంచశాంతి సంస్థ, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నేతృత్వంలో వరల్డ్ పీస్ ఫెస్టివల్ సువార్త సభలకు పలు షరతులతో హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈనెల 24న సికింద్రాబాద్ జింఖానా మైదానంలో నిర్వహించతలపెట్టిన ప్రపంచ శాంతి పండగకు డిప్యూటీ పోలీ్‌సకమిషనర్ అనుమతి ఇవ్వకపోవడంపై కేఏ పాల్ నేతృత్వంలోని గోస్పెల్ (అన్‌రీచ్డ్ మిలియన్స్ సొసైటీ) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం గతంలోనూ ఇలాంటి సభలు నిర్వహించారని.. ప్రసంగాలు లేకుండా ప్రార్థనల కోసం షరతులతో అనుమతి ఇవ్వవచ్చని పేర్కొంది. శబ్దకాలుష్య పరిమితులకు లోబడి డీజేలు వాడకుండా వెయ్యి మందితో గ్లోబల్ పీస్ ఫెస్టివల్ నిర్వహించుకోవచ్చని పేర్కొంది. ప్రార్థనలు తప్ప ప్రసంగాలు లేకుండా 24న సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమావేశం ముగించాలని తెలిపింది.