Share News

OMC Mining Case: ఐఏఎస్‌ శ్రీలక్ష్మి పూర్తిస్థాయి విచారణ ఎదుర్కోవాల్సిందే!

ABN , Publish Date - Jul 26 , 2025 | 05:44 AM

ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసులో ఏపీకి చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి వై.శ్రీలక్ష్మికి భారీ ఎదురుదెబ్బ తగిలిగింది.

OMC Mining Case: ఐఏఎస్‌ శ్రీలక్ష్మి పూర్తిస్థాయి విచారణ ఎదుర్కోవాల్సిందే!

  • ఓఎంసీ కేసులో హైకోర్టు స్పష్టీకరణ

  • శ్రీలక్ష్మికి హైకోర్టు గతంలో ఊరట

  • కల్పించడంపై సుప్రీంకు వెళ్లిన సీబీఐ

  • మళ్లీ విచారించాలని హైకోర్టుకు ఆదేశం

  • రెండోసారి విచారించి శ్రీలక్ష్మి పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు ధర్మాసనం

హైదరాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసులో ఏపీకి చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి వై.శ్రీలక్ష్మికి భారీ ఎదురుదెబ్బ తగిలిగింది. ఈ కేసులో ఆరో నిందితురాలిగా ఉన్న శ్రీలక్ష్మి సీబీఐ కోర్టులో పూర్తిస్థాయి విచారణ ఎదుర్కోవాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టంచేసింది. ఆమె దాఖలు చేసిన క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. మాజీ మంత్రి, మైనింగ్‌ వ్యాపారి గాలి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అక్రమ మైనింగ్‌ కుంభకోణానికి శ్రీలక్ష్మి సహాయపడ్డారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇతర నిందితులుగా ఉన్న ఓఎంసీ డైరెక్టర్లు బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, అప్పటి గనుల శాఖ డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్‌, అలీఖాన్‌లను సీబీఐ కోర్టు దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. అయితే శ్రీలక్ష్మి క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో హైకోర్టు ఆమెకు ఊరట కల్పించింది. దీంతో ఆమె పాత్రపై సీబీఐ కోర్టులో విచారణ జరగలేదు. హైకోర్టు ఊరట కల్పించడంపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తీర్పును కొట్టేసింది.


శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌పై మళ్లీ విచారణ చేపట్టి, మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టింది. శ్రీలక్ష్మి తరఫున వివేక్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘ఓఎంసీకి లీజుల కేటాయింపునకు సంబంధించి నేను పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించే నాటికే నాకంటే ముందున్న కార్యదర్శి కృపానందం, మంత్రి సబితాఇంద్రారెడ్డి ఓఎంసీకి లీజు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. నేను వచ్చిన తర్వాత ఆ నిర్ణయాలను అమలు చేశారు. లీజు జీవోలో క్యాప్టివ్‌ మైనింగ్‌ అనే పదం కావాలనే పెట్టలేదని సీబీఐ ఆరోపిస్తోంది. అసలు క్యాప్టివ్‌ మైనింగ్‌ అనే షరతు విధించరాదని కేంద్రమే ఆదేశాలు జారీచేసింది. నేను రాకముందే అన్నీ జరిగిపోయాయి. నా కంటే ముందే ఉన్న కార్యదర్శి, మంత్రి నిర్దోషులుగా తేలిన తర్వాత నా పాత్రను ఎలా తప్పుబడతారు?’’ అని ప్రశ్నించారు.


సీబీఐ తరఫు న్యాయవాది శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. ‘మంత్రి అనుమతి లేకుండా శ్రీలక్ష్మి కేంద్రానికి లేఖలు రాశారు. ఓఎంసీకి గనుల కేటాయింపునకు ముందస్తు అనుమతి ఇవ్వాలని.. అలా ఇచ్చాక కేటాయింపు ప్రక్రియ ప్రారంభిస్తామని లేఖలో తెలిపారు. ఓఎంసీకి అనుకూలంగా వ్యవహరించినట్లు ఆధారాలున్నాయి. శ్రీలక్ష్మి బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న నిర్ణయాలే అమలయ్యాయి’ అని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. మైనింగ్‌ లీజులు, క్యాప్టివ్‌ మైనింగ్‌ వంటివన్నీ వివాదాస్పద అంశాలని.. అవన్నీ పూర్తిస్థాయి విచారణలోనే తేలతాయని పేర్కొంది. ప్రస్తుత క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌లో ఇటు పిటిషనర్‌, అటు సీబీఐ చెబుతున్న విషయాలన్నీ వాస్తవమా? కాదా? అని హైకోర్టు నిర్ణయించలేదని స్పష్టంచేసింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి పాత్ర ఏంటనేది విచారణలోనే తేలుతుందని.. ఆమె విచారణను ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పింది. శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.


ఈ వీడియోలను వీక్షించండి..

బెంబేలెత్తిస్తున్న అల్పపీడనం.. 4 రోజులు భారీ వర్షాలు!

గోవా గవర్నర్ గా రేపు అశోక్ గజపతి రాజు ప్రమాణస్వీకారం

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jul 26 , 2025 | 05:48 AM