Share News

Liquor Price Hike: మద్యం ప్రియం..

ABN , Publish Date - Apr 18 , 2025 | 04:36 AM

రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటు భర్తీకోసం త్వరలో మద్యం ధరలను పెంచడానికి సన్నద్ధమైనట్లు సమాచారం. ఇటీవలే బీర్లపై 15 శాతం ధరలు సర్కారు పెంచిన సంగతి తెలిసిందే. మద్యం ధరల పెంపునకు ప్రభుత్వానికి ఎక్సైజ్‌శాఖ అధికారులు రెండు రకాల ప్రతిపాదనలను సమర్పించారు.

Liquor Price Hike: మద్యం ప్రియం..

  • ఆర్థిక లోటు భర్తీ కోసం త్వరలో ధరల పెంపు?

  • సర్కారు ముందు రెండు ప్రతిపాదనలు

  • బాటిల్‌పై నిర్దిష్ట మొత్తం పెంపు.. పన్నుల పునర్వ్యవస్థీకరణ

  • వార్షికాదాయం రూ.4 వేల కోట్ల వరకు పెరిగే అవకాశం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటు భర్తీకోసం త్వరలో మద్యం ధరలను పెంచడానికి సన్నద్ధమైనట్లు సమాచారం. ఇటీవలే బీర్లపై 15 శాతం ధరలు సర్కారు పెంచిన సంగతి తెలిసిందే. మద్యం ధరల పెంపునకు ప్రభుత్వానికి ఎక్సైజ్‌శాఖ అధికారులు రెండు రకాల ప్రతిపాదనలను సమర్పించారు. మద్యం బాటిల్‌పై రూ.10 చొప్పున పెంచడంతోపాటు పన్నుల విధానాన్ని పునఃసమీక్షించి పన్నులను పునర్వ్యవస్థీకరించాలని సూచించినట్లు సమాచారం. బాటిల్‌పై రూ.10 చొప్పున పెంచితే అదనంగా నెలకు రూ.180 కోట్లు.. పన్నుల పునర్వ్యవస్థీకరణతో బాటిల్‌పై రూ.20 చొప్పున రూ.360 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనాలు రూపొందించారు.


దీని ప్రకారం మద్యం అమ్మకాలతో వార్షికాదాయం రూ.2,000 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల వరకూ పెరగనున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మద్యం ద్వారా ఆదాయం రూ.27,600 కోట్లు వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేశారు. చీప్‌ లిక్కర్‌ మినహా ప్రీమియర్‌ బాండ్ల మద్యం ధరలు పెంచాలని యోచిస్తున్న సర్కార్‌.. ఈ విషయమై త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated Date - Apr 18 , 2025 | 04:36 AM