Share News

CMRF: మరింత కొత్తగా సీఎంఆర్‌ఎఫ్‌

ABN , Publish Date - Jul 27 , 2025 | 03:45 AM

ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) పథకాన్ని అక్రమాలకు, అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం పటిష్ఠంగా అమలు చేస్తోంది.

CMRF: మరింత కొత్తగా సీఎంఆర్‌ఎఫ్‌

  • దరఖాస్తుదారు వాట్సా్‌పకే చెక్కు వివరాలు

  • సీఎం రేవంత్‌ సందేశంతో ప్రత్యేకంగా డిజైన్‌

  • 19 నెలల్లో 3.23లక్షల మందికి సాయం

హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) పథకాన్ని అక్రమాలకు, అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం పటిష్ఠంగా అమలు చేస్తోంది. ఇప్పటికే పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. తాజాగా మరో కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. సీఎంఆర్‌ఎఫ్‌ సాయం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో పొందుపర్చిన ఫోన్‌ నంబరుకు చెక్కు వివరాలతో పాటు సీఎం రేవంత్‌ సందేశాన్ని జతచేసి పంపుతున్నారు. అలాగే చెక్కు విడుదలైన తేదీతో పాటు దరఖాస్తు చేసిన ప్రజాప్రతినిధి కార్యాలయానికి ఎప్పుడు చేరుతుందనే వివరాలను కూడా మెసేజ్‌ రూపంలో లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలోని కొంతమంది ప్రజాప్రతినిధులు వారి పరిధిలో అందించే సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులపై ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ సందేశాన్ని తొలగించి లబ్ధిదారులకు అందిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఒకటి, రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సీఎం సందేశం లేకుండా ఇచ్చిన చెక్కులు కూడా బహిర్గతమయ్యాయి.


ఈ క్రమంలోనే అధికారులు సీఎంఆర్‌ఎఫ్‌ దరఖాస్తు ప్రక్రియను ఆన్‌లైన్‌ చేసినట్టుగానే.. లబ్ధిదారులకు అందించే చెక్కుల వివరాలను కూడా వారి వాట్సా్‌పకే పంపుతున్నారు. అలాగే చికిత్సకు ముందు ఆస్పత్రులకు ఇచ్చే లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌వోసీ) పత్రాలపైనా ప్రత్యేకంగా ‘క్యూఆర్‌ కోడ్‌’లను ముద్రిస్తున్నారు. ఆ కోడ్‌ను స్కాన్‌ చేయగానే ఆ లెటర్‌ ఎవరికి ఇచ్చారు, ఆ పేషంట్‌ పేరు, మంజూరు చేసిన నగదు వివరాలన్నీ కనబడుతున్నాయి. మరోవైపు.. సీఎంఆర్‌ఎఫ్‌ సాయంలో ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన 19 నెలల కాలంలోనే సీఎంఆర్‌ఎఫ్‌ కింద రూ.1,399.21 కోట్ల నిధులను విడుదల చేసింది. 2023 డిసెంబరు 7 నుంచి 2025 జూలై 26నాటికి దాదాపు 3,23,739 మంది నిరుపేద, పేద, మధ్య తరగతి కుటుంబాలకు సర్కారు వివిధ రూపాల్లో సాయం అందించింది. చికిత్సకు ముందు అందించే లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌ఓసీ)ల ద్వారా 27,872 మందికి రూ.413.25 కోట్లు, అలాగే చికిత్స అనంతరం దరఖాస్తు చేసుకున్న 3,01,867 మందికి రూ.985.96 కోట్ల చొప్పున నిధులను విడుదల చేసింది.


ఈవార్తలు కూడా చదవండి..

పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..

సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 27 , 2025 | 03:45 AM