Share News

High Court: భూదాన్‌ భూములపై విచారణకు సిద్ధం

ABN , Publish Date - Jul 31 , 2025 | 05:52 AM

రాష్ట్రవ్యాప్తంగా భూదాన్‌ భూములపై విచారణకు సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. హైకోర్టు ఆదేశిస్తే

High Court: భూదాన్‌ భూములపై విచారణకు సిద్ధం

  • హైకోర్టు ఆదేశిస్తే కమిషన్‌ వేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం

  • నాగారం వివాదాస్పద భూములపై కొనసాగిన విచారణ

హైదరాబాద్‌, జూలై 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా భూదాన్‌ భూములపై విచారణకు సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. హైకోర్టు ఆదేశిస్తే రాష్ట్రంలో మొత్తం ఎంత భూదాన్‌ భూమి ఉంది? ఎలా బదిలీ అయిందనే అంశాలపై కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ యాక్ట్‌-1952 ప్రకారం విచారణ కమిషన్‌ నియమించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది. అయితే నాగారంలోని సర్వే నంబర్‌ 194, 195 భూములు మాత్రం ప్రైవేటు వ్యక్తులకు చెందినవని, వాటిపై ప్రభుత్వానికి విచారణ కమిషన్‌ వేసే ఉద్దేశం లేదని తెలిపింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే 181, 182, 194, 195 నంబర్లలో భూదాన్‌ భూములుగా పేర్కొంటున్న వివాదాస్పద భూములను ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు ఐఏఎస్‌, ఐపీఎ్‌సలు రికార్డులు మార్చి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని, దీనిపై విచారణ కమిషన్‌ వేయాలని బిర్ల మల్లేశ్‌, వడిత్య రాములు అనే వ్యక్తులు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై జస్టిస్‌ కె. లక్ష్మణ్‌ ధర్మాసనం బుధవారం విచారణ కొనసాగించింది. భూదాన్‌ భూముల వివరాలు కోరినా బోర్డు వాటిని అందజేయకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ సమాచారం అంతా సీసీఎల్‌ఏ వద్ద ఉంటుందని భూదాన్‌ బోర్డు న్యాయవాది తెలపగా.. అక్కడి నుంచి సమాచారం తీసుకుని సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు దాతల నుంచి స్వీకరించిన భూమి ఎంత? పేదలకు పంచిపెట్టిన భూమి ఎంత? బోర్డు వద్ద మిగిలి ఉన్న భూమి ఎంత? అనే వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. మరోవైపు భూమి కొనుగోలుదారుల తరఫున సీనియర్‌ న్యాయవాది పి. శ్రీరఘురాం వాదిస్తూ ఒక ప్రైవేటు వ్యక్తి ప్రైవేటు స్థలం కోసం విచారణ కమిషన్‌ వేసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరలేరని పేర్కొన్నారు. ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్

ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..

For More International News And Telugu News

Updated Date - Jul 31 , 2025 | 05:52 AM