Pension Scheme: పింఛన్ల పంపిణీలో కొత్త విధానం
ABN , Publish Date - Jul 29 , 2025 | 03:58 AM
బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు పడకపోవడంతో పింఛన్ తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

బయోమెట్రిక్ స్థానంలో ఫేస్ రికగ్నిషన్
ఆధార్ ఫొటోలతో సరిపోల్చేందుకు యాప్
23 లక్షల మందికి.. ఆగస్టు నుంచే అమలు
హైదరాబాద్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు పడకపోవడంతో పింఛన్ తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక నుంచి ఫేస్ రికగ్నిషన్(ముఖ గుర్తింపు) ద్వారా పింఛన్ చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెల నుంచే ఈ కొత్త విధానం అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 44లక్షలమంది వృద్దులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, చేనేత, గీత కార్మికులు, పైలేరియా, హెచ్‌ఐవీ, డయాలిసిస్ బాధితులకు చేయూత పింఛన్ అందిస్తున్న విషయం తెలిసిందే. వీరిలో 23లక్షల మందికి బయోమెట్రిక్ ద్వారా పింఛన్ చెల్లిస్తుండగా, పట్టణాలు, నగరాల్లోని 21లక్షల మందికి నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. అయితే, బయోమెట్రిక్ యంత్రాల్లో వేలి ముద్రలు పడక గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సమస్యను అధిగమించేందుకే కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఫేస్ రికగ్నిషన్ కోసం టీజీ ఆన్‌లైన్ సంస్థ సాంకేతిక సహకారంతో సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ) ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వేలిముద్రలతో పని లేకుండానే లబ్ధిదారునికి పింఛన్ చెల్లింపులు చేపట్టనున్నారు. ఈ మేరకు కొత్త విధానంలో పింఛన్లు పంపిణీ చేయనున్న 6వేల మంది పోస్ట్‌మ్యాన్‌లు, పోస్టుమాస్టర్లకు సెర్ప్ సంస్థ రూ. 13కోట్లతో ప్రత్యేకంగా ఫోన్లను కొనుగోలు చేసి అందించనుంది. ఇందులోభాగంగా లబ్ధిదారుల ఫొటోలు తీసి.. ఆధార్‌లో ఉన్న ఫొటోలతో సరిపోల్చి యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. అనంతరం వారికి పింఛన్ డబ్బులను చెల్లిస్తారు. ఎవరికైనా ఫొటోలు తీయలేని పరిస్థితి ఉంటే.. ప్రస్తుతం అమల్లో ఉన్న బయోమెట్రిక్ విధానం ద్వారానే పింఛన్ ఇస్తారు.
ఇవి కూడా చదవండి..
కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు, మోదీకి ఫోన్ కాల్ రాలేదు
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్
For More National News and Telugu News..