Mamnoor Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు 205 కోట్లు విడుదల
ABN , Publish Date - Jul 26 , 2025 | 04:37 AM
వరంగల్ జిల్లా మామునూరులో నిర్మించ తలపెట్టిన విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రూ.205 కోట్లు విడుదల చేసింది.

టైటిల్ క్లియర్‌గా ఉన్న 15 మంది రైతులకు రూ.13.74 కోట్లు చెల్లింపు
ఇళ్లు కోల్పోతున్న కుటుంబాలకిచ్చే పరిహారంపై రాని స్పష్టత
కోచి తరహాలో విమానాశ్రయం: సురేఖ
హైదరాబాద్, వరంగల్, మామునూరు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): వరంగల్ జిల్లా మామునూరులో నిర్మించ తలపెట్టిన విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రూ.205 కోట్లు విడుదల చేసింది. విమానాశ్రయానికి 949.14 ఎకరాల భూమి అవసరం కాగా ఎయిర్‌పోర్ట్ ఆఽథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ఆధీనంలో ప్రస్తుతం 696.14 ఎకరాల భూమి ఉంది. మరో 253 ఎకరాల భూమి సేకరణ కోసం రూ.205 కోట్లు కేటాయిస్తూ గతేడాది నవంబరులో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ భూసేకరణ తుది దశకు చేరడంతో పరిహారం చెల్లించేందుకు ఇప్పుడు నిధులు విడుదల చేశారు. నిధులు విడుదలైన వెంటనే.. టైటిల్ క్లియర్‌గా ఉన్న 15మంది రైతుల ఖాతాల్లో రూ.13.74కోట్ల పరిహారాన్ని జమ చేశామని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద ప్రకటించారు. భూసేకరణలో భాగంగా మామునూరు పరిసర ప్రాంతాలైన గాడిపల్లి, నక్కలపల్లి, గుంటూరుపల్లి గ్రామాల్లో 240 ఎకరాల వ్యవసాయ భూమి, 61,134.5 చదరపు గజాల వ్యవసాయేత భూమిని సేకరిస్తున్నారు. ఈ సేకరణలో 12మంది తమ ఇళ్లను కోల్పోతున్నారు.
అయితే, పలుమార్లు చర్చల అనంతరం వ్యవసాయ భూమికి ఎకరాకు రూ.1.20కోట్లు, వ్యవసాయేతర భూమి గజానికి రూ.4,887 పరిహారంగా నిర్ణయించారు. కాగా, ఇళ్లు కోల్పోతున్న వారికి ఎంత పరిహారం ఇవ్వాలనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇల్లు కోల్పోతున్న ఒక్కో కుటుంబానికి రూ.11.56 లక్షలు చొప్పున ఇస్తామని గాడేపల్లిలో శుక్రవారం జరిగిన గ్రామసభలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి తెలిపారు. అంతేకాక, భవన నిర్మాణ ఖర్చులను అదనంగా చెల్లిస్తామని ప్రతిపాదించారు. ఇందుకు సమ్మతమైతే తహసీల్దార్‌కు లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. అయితే, ఈ ప్రతిపాదినపై అసంతృప్తి వ్యక్తం చేసిన బాధితులు మార్కెట్ రేటు ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ అంశం పెండింగ్‌లో పడింది. భూసేకరణ పూర్తయితే మూడేళ్లలో ఎయిర్‌పోర్టు పనులు పూర్తవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, వరంగల్ ఎయిర్‌పోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం పట్ల మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కొండా సురేఖ ధన్యవాదాలు తెలియజేశారు. కేరళలోని కోచి అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో మామునూరు ఎయిర్‌పోర్టు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లుగా మంత్రి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా..
బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..
For Telangana News And Telugu News