ఈ నెలాఖరులోపు బకాయిలు చెల్లించాల్సిందే
ABN , Publish Date - Jun 19 , 2025 | 04:15 AM
గతంలో ప్రకటించిన విధంగా ఈనెల 30లోగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వానికి కాలేజీ యాజమాన్యాల విజ్ఞప్తి
హైదరాబాద్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): గతంలో ప్రకటించిన విధంగా ఈనెల 30లోగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మా, న్యాయ, మేనేజ్మెంట్ కళాశాలల ప్రతినిధులు బుధవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ఉన్నత విద్యాసంస్థల సంఘాలన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చి సంయుక్త కార్యచరణ సంఘం (జేఏసీ)గా ఏర్పడ్డాయి. దీనికి అధ్యక్షుడిగా అరోరా విద్యాసంస్థల చైర్మన్ నిమ్మటూరి రమేశ్‌బాబు ఎన్నికయ్యారు.
వివిధ విద్యాసంస్థల చైర్మన్లతో కలిపి మొత్తం 30 మందితో సభ్యులతో పాలకవర్గం ఏర్పడింది. బుధవారం జరిగిన జేఏసీ తొలి సమావేశంలో అనేక తీర్మానాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 2023-24 బకాయులను వచ్చే మూడు నెలల్లో, 2024-25 బకాయిలను ఈ ఏడాది చివరిలోగా విడుదల చేయాలని సమావేశంలో తీర్మానించారు. 2025-26 నుంచి ప్రతి ఏటా 4 విడతలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించేలా ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. బకాయిలు భారీగా ఉండటంతో నిర్వహణ కష్టసాధ్యంగా మారిందని జేఏసీ ప్రతినిధులు రమేశ్ బాబు, కోటల శంకరప్ప, రవికుమార్, కొడాలి కృష్ణారావు, కాటం సునీల్ కుమార్, తదితరులు పేర్కొన్నారు.