Telangana Armed Struggle: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు దొడ్డా పద్మ కన్నుమూత
ABN , Publish Date - Jul 30 , 2025 | 03:30 AM
నిజాం వ్యతిరేక, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కొరియర్‌గా సేవలందించిన దొడ్డా పద్మ(99) కన్నుమూశారు. ఈ నెల 25న సూర్యాపేట జిల్లా చిలుకూరులోని స్వగృహంలో ఆమె కాలుజారి కిందపడడంతో తుంటి ఎముకకు ఫ్రాక్చర్ అయింది.

మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య సతీమణి
నిజాం వ్యతిరేక, రైతాంగ పోరాటంలో పాత్ర
సూర్యాపేట జిల్లా చిలుకూరులో నేడు అంత్యక్రియలు
హైదరాబాద్ సిటీ, జూలై 29 (ఆంధ్రజ్యోతి): నిజాం వ్యతిరేక, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కొరియర్‌గా సేవలందించిన దొడ్డా పద్మ(99) కన్నుమూశారు. ఈ నెల 25న సూర్యాపేట జిల్లా చిలుకూరులోని స్వగృహంలో ఆమె కాలుజారి కిందపడడంతో తుంటి ఎముకకు ఫ్రాక్చర్ అయింది. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా, మంగళవారం శస్త్రచికిత్స అనంతరం రక్తపోటులో హెచ్చుతగ్గుల వల్ల పద్మ హఠాన్మరణం చెందారని కుమార్తె కల్పన కొడారు తెలిపారు. పద్మ భర్త దివంగత దొడ్డా నర్సయ్య భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) నాయకుడిగా, హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో నల్లమల ప్రాంతంలో మూడేళ్లు భర్తతో పాటు పద్మ అజ్ఞాతవాసం గడిపారు.
ఆ సమయంలో కమ్యూనిస్టు పార్టీ సాహిత్యాన్ని బట్వాడా చేయడంలాంటి పనుల్లో ఆమె చురుగ్గా వ్యవహరించారు. పద్మ సొంతూరు ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లా బుద్ధవరం గ్రామం. వివాహానంతరం భర్త స్వగ్రామం ఉమ్మడి నల్లగొండ జిల్లా చిలుకూరులో స్థిరపడ్డారు. రహస్య జీవితం అనంతరం అఖిలభారత మహిళా సమాఖ్యలోనూ సుదీర్ఘకాలం పనిచేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక చదవకుండా తన రోజు సాగదని, అందులోనూ ‘కొత్త పలుకు’ అంటే చాలా ఇష్టమని దొడ్డా పద్మ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పద్మ మృతికి స్వాతంత్య్ర సమరయోధుడు కందిమళ్ల ప్రతాపరెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, సీపీఐ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. పద్మ అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం చిలుకూరులో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
Read latest Telangana News And Telugu News