Dharani Portal: ధరణిని బంధించిన బగ్!
ABN , Publish Date - Jan 30 , 2025 | 04:47 AM
ఒక చిన్న బగ్.. ధరణి పోర్టల్ నిర్వహణను కుప్పకూల్చేంత పని చేసింది. ఎక్కడ లోపం ఉందో తెలుసుకునేందుకు నేషనల్ ఇన్‌ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ) సాంకేతిక నిపుణులు, సీసీఎల్‌ఏ అధికారులు తలపట్టుకోవాల్సి వచ్చింది.

ఈ నెలారంభం నుంచి 2 వారాలపాటు సమస్య.. సర్వర్ పూర్తిగా మొరాయించి తీవ్ర ఇబ్బందులు
పోర్టల్.. కుప్పకూలే స్థాయికి పరిస్థితి
గత నిర్వహణ సంస్థ టెర్రాసిస్ వల్లే!
సామర్థ్యానికి మించి సీపీ వినియోగంతో కుప్పకూలిన సర్వర్
ఫైళ్ల అప్‌లోడ్‌లో తీవ్ర జాప్యం.. ప్రస్తుతం సాఫీగా రిజిస్ర్టేషన్లు
హైదరాబాద్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ఒక చిన్న బగ్.. ధరణి పోర్టల్ నిర్వహణను కుప్పకూల్చేంత పని చేసింది. ఎక్కడ లోపం ఉందో తెలుసుకునేందుకు నేషనల్ ఇన్‌ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ) సాంకేతిక నిపుణులు, సీసీఎల్‌ఏ అధికారులు తలపట్టుకోవాల్సి వచ్చింది. ఈ నెల 2న స్వల్పంగా మొదలైన సమస్య.. 8వ తేదీ తరువాత తీవ్రమై.. సర్వర్ పూర్తిగా మొరాయించే పరిస్థితికి చేరింది. దీంతో అధికారులు, ఎన్‌ఐసీ సాంకేతిక నిపుణులు తీవ్రంగా శ్రమించి జనవరి 15 తరువాత క్రమేణా పోర్టల్‌ను యథాస్థితికి తీసుకొచ్చారు. అయితే ఇందుకు కారణం గతంలో ధరణి పోర్టల్‌ను నిర్వహించిన టెర్రాసిస్ సంస్థ నిర్వాకమేనని తేలింది. భూ యజమానులకు సంబంధించిన వివరాల గోప్యతను ఆ సంస్థ గాలికొదిలేసింది. వారి ఆధార్ వివరాలు బహిర్గతం కాకుండా పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉండగా.. టెర్రాసిస్ ఈ నిబంధనను పాటించకుండా బహిరంగంగా కనిపించేలా చేసింది. ఇది ఆధార్ చట్టరీత్యా కూడా ఆమోదయోగ్యం కాదు. దీంతోపాటు ఇతర సమాచారాన్ని కూడా ఎన్‌క్రి్‌ప్ట చేయకపోవడంతో.. సెంట్రల్ ప్రాసెసర్ (సీపీ) వినియోగం వంద శాతం పెరిగింది. దీంతో లోడంతా సర్వర్‌పై పడి సర్వర్ మొరాయించే పరిస్థితి తలెత్తింది. స్టేట్ డాటా సెంటర్ (ఎస్‌డీసీ) అధీనంలో ఉన్న సర్వర్ ఎందుకు మొరాయిస్తుందో తొలుత అధికారులకు కూడా అంతుబట్టలేదు. చివరికి చాలా అప్లికేషన్లను ఎన్‌క్రి్‌ప్ట చేయకుండా సమాచారాన్ని బహిరంగంగా ఉంచడం వల్లనే ఈ సమస్య తలెత్తినట్లు గుర్తించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ఐటీ నిపుణులను సంప్రదించి సమస్యను పరిష్కరించారు.
బదలాయింపులో హడావుడి వల్లే..!
ధరణి పోర్టల్ నిర్వహణ టెర్రాసిస్ నుంచి ఎన్‌ఐసీ చేతికిలోకి వచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఒక సంస్థ నుంచి మరో సంస్థకు డేటా బదిలీ జరిగేటప్పుడు స్టెబిలైజేషన్ పీరియడ్ (స్థిరీకరణ కాలం) మూడు నెలలు ఉంటుంది. అయితే ఇక్కడ ప్రభుత్వ అవసరాల రీత్యా నెల రోజుల వ్యవధిలోనే హడావుడిగా అన్నీ చేయాల్సి రావడంతో సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తాయి. ఐటీ పరిశ్రమ ప్రమాణాల ప్రకారం నాలెడ్ట్ బదలాయింపునకు కూడా ఆరు నెలల సమయం తీసుకుంటారు. భూములకు సంబంధించిన సమగ్ర వివరాలతో ధరణి పోర్టల్‌లో 400 నుంచి 500 పేజీల్లో నిర్వహించాల్సిన డేటాను టెర్రాసిస్ సంస్థ సుమారు 7వేల పేజీల్లో నిర్వహించింది. అయితే అవసరానికి మించి పేజీలను సృష్టించడం, అవసరం లేకున్నా 30 లక్షల లైన్ల కోడింగ్ పెట్టడం వంటివన్నీ రీవ్యాంప్ చేపట్టిన ఎన్‌ఐసీకి అవరోధంగా మారాయి. పేజీ నిర్మాణానికి సంబంధించి టెర్రాసిస్ మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ పద్ధతిని ఎంచుకోవడంతో ఒక్క అప్లికేషన్‌లో లోపాలను సరిదిద్దాలన్నా అందులో ఉన్న అన్ని అప్లికేషన్లను నిలిపేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. దీని వల్ల కూడా స్లాట్ల బుకింగ్‌లోనూ, రిజిస్ర్టేషన్లలో జాప్యం జరిగిందని అంటున్నారు. ఎన్‌ఐసీ అధికారులు ధరణి పోర్టల్‌కు సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించి ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించారు. సాంకేతికపరమైన లోపాలున్నట్లు గుర్తించారు. ఒక చిన్న బగ్ దీనంతటికీ కారణమని తేల్చారు. వాటిని సరిదిద్ది స్లాట్ బుకింగ్స్, లావాదేవీలను పూర్వపు స్థితికి తీసుకొచ్చారు. ఈ నెల 27న ధరణిలో 3,538 స్లాట్స్ బుక్ చేయగా.. వాటిలో 3,280 లావాదేవీలు జరిగాయి. సాధారణంగా నిత్యం సగటున 2వేల నుంచి 2500 వరకు లావాదేవీలు జరుగుతాయని సమాచారం. అయితే ఈ నెల మొదటి రెండు వారాల్లో తలెత్తిన సాంకేతిక ఇబ్బందులతో ఈ సంఖ్య భారీగా తగ్గింది. ప్రస్తుతం ఇది సాధారణ స్థితికి చేరిందని అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లాలో ఇప్పటికీ కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలను అధిగమించలేకపోతున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి.
జిల్లాల్లో ధరణి లావాదేవీల పరిస్థితి ఇదీ..
నల్లగొండ జిల్లాలో సర్వర్ సమస్యతో స్లాట్‌ల బుకింగ్, రిజర్వేషన్లలో సమస్య ఉంది. రోజుకు 7, 8కి మించి తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ర్టేషన్లు జరగడం లేదు. రంగారెడ్డి జిల్లాలో రిజిస్ర్టేషన్లు కొనసాగుతున్నా.. అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు వస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. యాదాద్రి జిల్లాలో రిజిస్ర్టేషన్లు జరుగుతున్నా.. కొంత జాప్యం ఉంది. వికారాబాద్ జిల్లాలో గత రెండు రోజుల నుంచి రిజిస్ర్టేషన్లలో వేగం పెరిగింది. ధరణి సవ్యంగా పని చేస్తోందని అధికారులు తెలిపారు. జనగామ జిల్లాలో కొన్ని మండలాల్లో సర్వర్ సమస్య లేకున్నా కొన్ని మండలాల్లో మొరాయిస్తుందనే ఫిర్యాదులు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో గతంలో అరగంటలో రిజిస్ర్టేషన్ పూర్తవగా.. ఇప్పుడు గంటన్నర సమయం పడుతోందంటున్నారు. భద్రాది కొత్తగూడెం జిల్లాలో గతంలో కంటే కొంత నెమ్మదిగా రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయి. జగిత్యాల జిల్లాలో ధరణి సమస్య లేదని, సాఫీగానే రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాని చెబుతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో రెండు వారాల క్రితం సమస్య ఉండేదని, ప్రస్తుతం రెండు రోజుల నుంచి ఎలాంటి సమస్య లేదని రైతులు అంటున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో లాగిన్ సమస్య ఉంది.
ఇవీ చదవండి:
పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు
సంజూ కెరీర్ ఫినిష్.. ఒక్క షాట్ ఎంత పని చేసింది
అతడి వల్లే ఓడాం.. ఇది అస్సలు మర్చిపోను: సూర్య
టీమిండియాకు కొత్త కెప్టెన్.. చేజేతులా చేసుకున్న సూర్య
ఇంత పొగరు అవసరమా హార్దిక్.. ఆల్‌రౌండర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి