Share News

ఆవు మెదడు చూపుతూ పాఠ్యాంశాల బోధన?!

ABN , Publish Date - Jun 26 , 2025 | 05:08 AM

విద్యార్థులకు తరగతి గదిలో ప్రత్యక్షంగా ఆవు మెదడు తెచ్చి, ప్రయోగాత్మకంగా పాఠ్యాంశాలు బోధించారన్న ఆరోపణలతో సైన్స్‌ టీచర్‌ను విద్యాశాఖ సస్పెండ్‌ చేయగా, పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

ఆవు మెదడు చూపుతూ పాఠ్యాంశాల బోధన?!

  • బడి వద్ద బీజేపీ, ఏబీవీపీ, హిందూ వాహిని నాయకుల ఆందోళన

  • టీచర్‌ సస్పెన్షన్‌.. కేసు నమోదు

యలాల/తాండూరు, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు తరగతి గదిలో ప్రత్యక్షంగా ఆవు మెదడు తెచ్చి, ప్రయోగాత్మకంగా పాఠ్యాంశాలు బోధించారన్న ఆరోపణలతో సైన్స్‌ టీచర్‌ను విద్యాశాఖ సస్పెండ్‌ చేయగా, పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే, తాను చూపించింది పొట్టేలు మెదడని, తనపై కుట్ర పన్ని సస్పెండ్‌ చేయించారని ఆ టీచర్‌ వాపోయారు. సైన్స్‌ టీచర్‌గా విద్యార్థులకు అవగాహన కల్పించాలని భావించానని, వేరే దురుద్దేశం లేదని చెప్పారు.


వికారాబాద్‌ జిల్లా యాలాలలోని జడ్పీహెచ్‌ఎస్‌ బాలికల ఉన్నత పాఠశాలలో సైన్స్‌ ఉపాధ్యాయురాలు ఖాసీంబీ మంగళవారం పదో తరగతి విద్యార్థులకు తాను తెచ్చిన ఆవు మెదడు చూపిస్తూ.. పాఠ్యాంశాలు బోధించినట్లు చెబుతున్నారు. విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేయగా.. ఆ ఫొటో సైతం బుధవారం వాట్సాప్‌ గ్రూప్‌ల్లో చక్కర్లు కొట్టింది. దీంతో బీజేపీ, ఏబీవీపీ, హిందూవాహిని నాయకులు బుధవారం పాఠశాలఎదుట ఆందోళనకు దిగారు. డీఈవో, ఎంఈవోకు విద్యార్థులు ఫిర్యాదు చేయగా.. ఆమెను సస్పెండ్‌ చేస్తూ డీఈవో రేణుకాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, టీచర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గిరి తెలిపారు.

Updated Date - Jun 26 , 2025 | 05:08 AM