Balapur: మత్తు కోసం ఒకేసారి ఇంజక్షన్, ట్యాబ్లెట్లు
ABN , Publish Date - Apr 22 , 2025 | 04:15 AM
హైదరాబాద్ బాలాపూర్‌లో మత్తు కోసం ఇంజక్షన్, ట్యాబ్లెట్లతో విషతతుగ్రస్తులైన ఇద్దరు స్నేహితులు, ఒకరు మృతి చెందగా, మరొకరికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మత్తు మందు విక్రయించిన నిందితుడు సాహిల్ అదుపులోకి తీసుకోబడ్డారు

వికటించి ఓ ఇంటర్ విద్యార్థి మృతి
ఆస్పత్రిలో అతని ఇద్దరు స్నేహితులు
హైదరాబాద్ బాలాపూర్‌లో ఘటన
పోలీసుల అదుపులో వారికి మత్తు
మందు విక్రయించిన నిందితుడు
హైదరాబాద్ బాలాపూర్‌లో ఘటన
పహాడిషరీఫ్ ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): మత్తు కోసం ఇంజక్షన్, ట్యాబ్లెట్లు కలిపి తీసుకొని వికటించడంతో ఓ ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. అతని ఇద్దరు స్నేహితులు చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టిమిట్టాడుతున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో జరిగింది. బాలాపూర్‌కు చెందిన ఓ 17 ఏళ్ల బాలుడు ఆరాంఘర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన షాబాజ్ (22), కొత్తపేటకు చెందిన మరో 17 ఏళ్ల బాలుడు అతని స్నేహితులు. గత కొంత కాలంగా వీరు మత్తుకు అలవాటుపడ్డారు. వీరు షాహిన్‌నగర్‌కు చెందిన సాహిల్ అనే వ్యక్తి వద్ద మెడికల్ డ్రగ్స్‌ను కొనుగోలు చేసి నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి శరీరంలోకి ఎక్కించుకునేవారు.
ఈ నెల 17న ఎప్పటిలాగే ఇంజక్షన్‌ను కొనుగోలు చేసి ఎక్కించుకున్నారు. మత్తు ఎక్కకపోవడంతో ఇంకొద్దిగ ఇంజక్షన్‌తో పాటు, ట్యాబ్లెట్లు తీసుకున్నారు. కాసేపటికి ముగ్గురు స్పృహ తప్పి పడిపోయారు. అటుగా వెళ్తున్న వారు గమనించి వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఒకరు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరికి మత్తు ఇంజక్షన్‌లు విక్రయించిన నిందితుడు సాహిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.