Share News

DCP Shilpavalli: మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై కఠిన చర్యలు

ABN , Publish Date - Aug 03 , 2025 | 05:20 AM

ధర్మ పరిరక్షణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనేవారిపై, విద్వేషాలను రెచ్చగొట్టేవారిపై కఠిన చర్యలు తప్పవని సెంట్రల్‌ జోన్‌ డీసీపీ శిల్పవల్లి హెచ్చరించారు.

DCP Shilpavalli: మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై కఠిన చర్యలు

  • సెంట్రల్‌ జోన్‌ డీసీపీ శిల్పవల్లి హెచ్చరిక

  • యువతి, స్నేహితుడి వీడియో తీసి, విద్వేష వ్యాఖ్యలతో వైరల్‌ చేసిన వ్యక్తి అరెస్టు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ధర్మ పరిరక్షణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనేవారిపై, విద్వేషాలను రెచ్చగొట్టేవారిపై కఠిన చర్యలు తప్పవని సెంట్రల్‌ జోన్‌ డీసీపీ శిల్పవల్లి హెచ్చరించారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద స్నేహితుడితో ఉన్న ఓ యువతిని దూషించడం, ఆమెపై దాడికి యత్నించడమే కాకుండా వీడియో తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసిన యువకుడిని అరెస్ట్‌ చేశామని తెలిపారు. చార్మినార్‌ శంకర్‌గంజ్‌కు చెందిన మహ్మద్‌ రాహిల్‌(24) ర్యాపిడో డ్రైవర్‌. గత నెల 29 రాత్రి హిజాబ్‌ ధరించిన ఓ యువతి ఆమె స్నేహితుడు ఎన్టీఆర్‌ మార్గ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఉన్నారు.


రాహిల్‌ యువతిపై ఆగ్రహం వ్యక్తం చేసి, దాడికి యత్నించాడు. భయపడ్డ ఇద్దరు బైక్‌పై వెళ్లిపోగా.. రాహిల్‌ వారిని బైక్‌పై ఫాలో అయి వీడియో తీశాడు. ఈ వీడియో ను ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌లో పెట్టి, విద్వేషాలు రెచ్చగొట్టే వాఖ్యలను పోస్టు చేశాడు. బాధిత యువకుడి ఫిర్యాదుతో సైఫాబాద్‌ పోలీసులు నిందితుడి అరెస్ట్‌ చేశా రు. మరోవైపు, సికింద్రాబాద్‌ మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గత నెల 30న కొంత మంది ఆవులను దొంగలించి వాహనంలో తీసుకెళ్లారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ ఘటనపై మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కొందరు సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలతోనే కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు వార్తలను ప్రసారం చేశాయి. దీంతో వారితో పాటు, ఆయా యూట్యూబ్‌ ఛానెళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Aug 03 , 2025 | 05:20 AM