Share News

‘కోర్‌’ ఇంజనీరింగ్‌ సీట్లన్నీ భర్తీ చేయాలి!

ABN , Publish Date - Jun 20 , 2025 | 05:10 AM

ఇంజనీరింగ్‌ అంటే కంప్యూటర్‌ సైన్స్‌ మాత్రమే అన్న భావన విద్యార్థులు, తల్లిదండ్రుల్లో పెరిగిపోతోంది. అందులోనూ కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) కోసం విద్యార్థులు పోటీపడుతున్నారు.

‘కోర్‌’ ఇంజనీరింగ్‌ సీట్లన్నీ భర్తీ చేయాలి!

భారీ ఉద్యోగ అవకాశాలపై ప్రచారం చేయాలి.. విద్యార్థులకున్న అపోహలు తొలగించాలి

  • రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రణాళికలు

  • 21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు

  • కర్ణాటకలో అమలవుతున్న విధానంపైనా అధ్యయనం

హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ అంటే కంప్యూటర్‌ సైన్స్‌ మాత్రమే అన్న భావన విద్యార్థులు, తల్లిదండ్రుల్లో పెరిగిపోతోంది. అందులోనూ కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) కోసం విద్యార్థులు పోటీపడుతున్నారు. కన్వీనర్‌ కోటాలో రాకపోతే, యాజమాన్య కోటాలోనైనా సాధించాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలూ భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. అందరూ సీఎ్‌సఈపైనే ఆసక్తి చూపుతుండడంతో సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ లాంటి కోర్‌ ఇంజనీరింగ్‌ కోర్సులు ఏటా తగ్గిపోతున్నాయి. భారీగా ఉపాధి అవకాశాలున్న ఈ కోర్సులపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన లేదన్న విషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి గుర్తించింది. ఈసారి కోర్‌ ఇంజనీరింగ్‌ సీట్లన్నీ భర్తీ చేయాలన్న లక్ష్యంతో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. కోర్‌ ఇంజనీరింగ్‌ కోర్సులను ప్రోత్సహించేందుకు కర్ణాటకలో అమలవుతున్న విధానాలనూ అధ్యయనం చేస్తోంది.


21న జేఎన్‌టీయూలో సదస్సు

త్వరలో ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌, జూలై మొదటివారం నుంచి ప్రవేశాల ప్రక్రియ షురూ అవుతుంది. ఆలోపే కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. కోర్‌ ఇంజనీరింగ్‌ కోర్సులపై ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నారు. మొదటి సదస్సు ఈ నెల 21న జేఎన్‌టీయూలో జరగనుంది. ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య బాలకిష్టారెడ్డితోపాటు కోర్‌ ఇంజనీరింగ్‌ నిపుణులు ఈ సమావేశంలో పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ఇదే తరహాలో ఈ నెలాఖరు వరకు అన్ని యూనివర్సిటీల పరిధిలో ఎప్‌సెట్‌ అభ్యర్థులకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, ఏరోస్పేస్‌, మైనింగ్‌, ఆటోమొబైల్‌, నిర్మాణ రంగాల్లో రాష్ట్రంలో భారీ ఉద్యోగ అవకాశాలు గురించి బాలకిష్టారెడ్డి విద్యార్థులకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. ఇటీవలే నిర్వహించిన క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో భారీ ప్యాకేజీలు పొందిన కోర్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులను ఈ సదస్సుల్లో పరిచయం చేయనున్నారు.


సివిల్‌, ఈఈఈ, మెకానికల్‌లో ఈసారి 11 వేలే..!

గతేడాది ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌లో రాష్ట్రవ్యాప్తంగా కోర్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో దాదాపు 15 వేల సీట్లున్నాయి. ఇందులో 100 కాలేజీల్లో సివిల్‌ ఇంజనీరింగ్‌లో మొత్తం 3574 సీట్లు ఉండగా 3028 (84.72ు) భర్తీ అయ్యాయి. అలాగే 119 కాలేజీల్లో ఈఈఈలో 4751 సీట్లలో 3977 (83.71ు), మెకానికల్‌లో 97 కాలేజీల్లోని 3385 సీట్లలో 2373 (70.10ు) భర్తీ అయ్యా యి. గత ఐదేళ్లతో పోలిస్తే ఏటా ఈ కోర్సులు తగ్గుతూనే ఉన్నాయి. 2020-21లో 137 కాలేజీల్లో 27445 సీట్లుండగా 44 శాతమే భర్తీ అయ్యాయి. 2021-22లో 130 కాలేజీల్లో 26341 సీట్లుండగా కేవలం 9010 (34.21ు) మాత్రమే భర్తీ అయ్యాయి. సీట్లు భారీగా మిగిలిపోవడంతో కాలేజీ యాజమాన్యాలు కోర్‌ కోర్సులను తగ్గిస్తున్నాయి. ఇలా 2022-23లో ఈ కోర్సుల్లో సీట్ల సంఖ్య 20992కి తగ్గింది. అప్పుడు కేవలం 6417 (30.57ు) సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 2023-24లో ఈ సీట్లు 17501కి చేరగా.. అందులోనూ 6528 (37.30ు) మాత్రమే భర్తీ అయ్యాయి. 2024-25లో 119 కాలేజీల్లో కోర్‌ ఇంజనీరింగ్‌లోని మూడు విభాగాల్లో 11710 సీట్లు ఉండగా 9378 (80.09ు) భర్తీ అయ్యాయి. దీంతో రాష్ట్రం మొత్తంలో ఈసారి 11 వేల సీట్లు ఉండే అవకాశాలున్నాయి. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్‌ ఇంజనీరింగ్‌ కోర్సులపై అవగాహన కల్పించడంతోపాటు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయనున్నామని బాలకిష్టారెడ్డి తెలిపారు.


కర్ణాటకలో లక్షకు పైగా ‘కోర్‌’ సీట్లు..

ఇంజనీరింగ్‌లో సీఎ్‌సఈ మోజు తెలంగాణ తరహాలో గతంలో కర్ణాటకలోనూ ఉండేది. అందరూ పరిమిత ఉద్యోగ అవకాశాలున్న సీఎ్‌సఈపైనే ఆసక్తి చూపిస్తే.. ఇతర కోర్సులు, వాటి ఆధారంగా లభించే ఉద్యోగాలకు యువత దూరం కాకూడదన్న లక్ష్యంగా అక్కడి ప్రభుత్వం ఐదారేళ్లుగా ప్రత్యేక చర్యలు చేపట్టింది. పరిశ్రమల్లో ఉద్యోగాల ప్రాధాన్యంతోపాటు ఈ కోర్సుల్లో చేరితే ఫీజు రాయితీలు కూడా అందిస్తోంది. కర్ణాటకలో మొత్తం 217 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఈ ఏడాది 135969 సీట్లు ఉండగా ఇందులో 64047 సీట్లను ప్రభుత్వం కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తుంది. అక్కడ మొత్తం సీట్లలో కేవలం 33813 (24 శాతం) మాత్రమే కంప్యూటర్‌ సైన్స్‌ ఉండగా.. కోర్‌ ఇంజనీరింగ్‌లో లక్షకు పైగా సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, ఫీజు రాయితీ, ఉపాధి అవకాశాలతో కోర్‌ ఇంజనీరింగ్‌ కోర్సులకు కర్ణాటకలో డిమాండ్‌ ఏర్పడింది. అక్కడి విధానాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యయనం చేస్తోంది. కోర్‌ కోర్సులను తొలగించవద్దని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో ఆ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించే విషయంపైనా అధికారులు యోచిస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు.


ఇవి కూడా చదవండి:

కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో లోకేష్ భేటీ

యోగాలో ప్రపంచ రికార్డు సృష్టిస్తాం..: మంత్రి సవిత

ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 20 , 2025 | 05:10 AM