Share News

Srisailam Highway: శ్రీశైలం హైవేపై మరోమారు ట్రాఫిక్‌ సర్వే!

ABN , Publish Date - Mar 15 , 2025 | 04:56 AM

శ్రీశైలం హైవేలో ట్రాఫిక్‌ తీరుతెన్నులపై రాష్ట్ర ప్రభుత్వం మరోమారు సర్వే నిర్వహించనుంది. ఇప్పటికే ఓ సారి సర్వే పూర్తవ్వగా.. రూ. 7,668 కోట్ల అంచనా వ్యయంతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి గాను సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను కేంద్రానికి సమర్పించింది.

Srisailam Highway: శ్రీశైలం హైవేపై మరోమారు ట్రాఫిక్‌ సర్వే!

  • రోజుకు తిరిగే వాహనాల సగటెంత?.. అందులో శ్రీశైల క్షేత్రానికి వెళ్లే వాహనాలెన్ని?

  • ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ని వెళ్తున్నాయి?.. హైవే ప్రారంభం-గమ్యస్థానం విధానంలో సర్వే

హైదరాబాద్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం హైవేలో ట్రాఫిక్‌ తీరుతెన్నులపై రాష్ట్ర ప్రభుత్వం మరోమారు సర్వే నిర్వహించనుంది. ఇప్పటికే ఓ సారి సర్వే పూర్తవ్వగా.. రూ. 7,668 కోట్ల అంచనా వ్యయంతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి గాను సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను కేంద్రానికి సమర్పించింది. ఈ సర్వే ప్రకారం ఈ రోడ్డుపై రోజుకు సగటున 7,181 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు తేలింది. ప్రాంతాల వారీగా మన్ననూర్‌ చెక్‌పోస్టు వరకు 7,668.. మన్ననూర్‌-వట్టర్‌పల్లి మధ్య 6,880.. వట్టర్‌పల్లి-ఈగలపెంట మధ్య 7,005 వాహనాలు తిరుగుతున్నట్లు తేలింది. ఈ రహదారిపై ఏటా 8ు చొప్పున ట్రాఫిక్‌ పెరుగుతూ.. 2027కల్లా వాహనాల సంఖ్య 10,100 సగటుకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్రం రీసర్వేకు ఆదేశించింది.


ఇలా ప్రాంతాల వారీగా కాకుండా.. హైవే ప్రారంభం-గమ్యస్థానం (ఆరిజన్‌-డెస్టినేషన్‌) విధానంలో సర్వే నిర్వహించాలని సూచించింది. దీంతో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ అధికారులు రీసర్వేకు సిద్ధమయ్యారు. హైవే మొత్తంలో వాహనాల సగటుతోపాటు.. శ్రీశైలం క్షేత్రానికి ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి? ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ని వెళ్తున్నాయి? అనే వివరాలను సేకరించనున్నారు. దాంతోపాటు.. కొత్త రోడ్డు ఏర్పాటైతే వినియోగం ఎలా ఉంటుంది? ప్రయాణికులు పాత రోడ్డునే ఎంచుకుంటారా? అనేదానిపై వాహనదారుల అభిప్రాయాన్ని సేకరించనున్నారు. ఈ నెలాఖరులోగా ఈ సర్వేను పూర్తిచేసి, కేంద్రానికి నివేదికను అందజేస్తారు. దీంతోపాటు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Updated Date - Mar 15 , 2025 | 04:56 AM