Supreme Court Verdict: అనర్హతపై నిర్ణయాధికారం స్పీకర్‌దే
ABN , Publish Date - Aug 01 , 2025 | 03:42 AM
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి

సుప్రీంకోర్టు గడువు మాత్రమే నిర్దేశించింది
కోర్టు ఆదేశాలను స్పీకర్ పాటించాల్సిందే
మరికొంత సమయం కూడా కోరవచ్చు
సుప్రీం తీర్పుపై న్యాయ నిపుణుల అభిప్రాయం
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పరస్పర విమర్శలు
‘చెంపదెబ్బలు మీకే’ అంటూ నేతల వ్యాఖ్యలు
న్యూఢిల్లీ/హైదరాబాద్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అనర్హత పిటిషన్‌లో పేర్కొన్న 10 మంది ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ పాటించాల్సిందేనని.. అయితే అనర్హతపై ఏ నిర్ణయం తీసుకోవాలన్నది మాత్రం సుప్రీంకోర్టు నిర్దేశించలేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అనర్హత పిటిషన్లపై స్పీకర్ చర్యలు ప్రారంభిస్తారని, ఒకవేళ ఈ పిటిషన్లపై మూడు నెలలు సరిపోకపోతే మరికొంత సమయం కోరవచ్చునని సుప్రీం మాజీ న్యాయమూర్తి ఒకరు తెలిపారు. మణిపూర్ అసెంబ్లీలో ఫిరాయింపులపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ గతంలో సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ రోహింగ్టన్ ఇచ్చిన తీర్పు తెలంగాణ ఎమ్మెల్యేల విషయంలో కూడా వర్తిస్తుందని ప్రముఖ న్యాయనిపుణుడు వికాస్ బన్సోడే తెలిపారు. స్పీకర్‌కు రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు ఎలాంటి రక్షణా కల్పించలేదని, ఆయన నిర్ణయాలు న్యాయసమీక్షకు లోను కావాల్సిందేనని చెప్పారు. అయితే, ఎమ్మెల్యేల అనర్హతపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అధికారాన్ని కోర్టు స్పీకర్‌కే వదిలేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇదిలా ఉండగా.. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామంటూనే ‘చెంపదెబ్బలు మీకంటే.. మీకే’ అంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పరస్పర విమర్శలకు దిగాయి.
స్పీకర్‌కు పలు ప్రత్యామ్నాయాలు..
ఈ పరిస్థితుల్లో సభాపతి ముందు రెండు, మూడు అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అందులో ఒకటి 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవడం అంటున్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం విషయంలో స్పీకర్‌కు పూర్తి అధికారం ఉంటుంది. తన ముందున్న ఆధారాల ప్రాతిపదికన ఆయన ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. ఒకవేళ స్పీకర్ తీసుకున్న నిర్ణయం నచ్చకపోతే పిటిషనర్లు మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చు. మరోవైపు సుప్రీం ఇచ్చింది సూచనతో కూడిన నిర్దేశమే అని స్పీకర్ భావిస్తే.. ఆయనకు న్యాయ సలహా కూడా అదేవిధంగా వస్తే.. 3 నెలల్లో నిర్ణయం తీసుకోకుండా కూడా ఉండొచ్చు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఫిరాయింపులపై అంతిమ నిర్ణయం స్పీకర్‌దేనని, అయితే వీలైనంత తొందరగా తీసుకోవాలని మాత్రమే ఉంది. వీలైనంత తొందరగా అంటే ఎంత సమయం అన్నది స్పష్టంగా పేర్కొనలేదు. మరోవైపు ప్రభుత్వం లేదా సభాపతి రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి విచారించాలని కూడా కోరవచ్చు. కాగా, సుప్రీం తీర్పు విషయంలో న్యాయ సలహా తీసుకుని ముందుకెళ్తానని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇప్పటికే ప్రకటించారు.
రాజకీయ విమర్శలు..
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, అనర్హత పిటిషన్‌పై సుప్రీం ఇచ్చిన తీర్పు రాజకీయంగా పరస్పర విమర్శలకు దారితీసింది. అలాగే తీర్పు తమకే అనుకూలం అంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలు ప్రకటించుకున్నాయి. బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయించి కాంగ్రె్‌సలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను సుప్రీం తిరస్కరించడంతో పాటు అనర్హతపై నిర్ణయాధికారం స్పీకర్‌దేనని స్పష్టం చేసింది. అంటే బీఆర్‌ఎస్ వేసిన పిటిషన్ మేరకు సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత విధించలేదు కదా? అని కాంగ్రెస్ అంటోంది. అయితే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గడువు విధించింది కదా? అని బీఆర్‌ఎస్ వాదిస్తోంది.
ముగ్గురిపైనే వేటు..?
అనర్హత పిటిషన్లు దాఖలైన 10 మంది ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తె ల్లం వెంకట్రావుపైనే వేటు పడే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. మిగతా ఏడుగురు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధిపై చర్చించేందుకే ముఖ్యమంత్రిని కలిశామని, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని వాదిస్తారని.. వారి వాదనను స్పీకర్ అంగీకరించే అవకాశాలు లేకపోలేదని ఆయన చెప్పారు.మూడునియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఒక రకంగా ఇది సీఎం రేవంత్‌కు మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు. మరోవైపు అనర్హత వేటు పడితే ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయని, ఆ పిటిషన్లను తేల్చడానికి మరికొంత సమయం పడుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. స్పీకర్ ఒక్కసారి నిర్ణయం అంటూ తీసుకున్న తర్వాత బంతి ఆయన కోర్టులో ఉండదని, సుప్రీం తీర్పును అనుసరించినట్లే అవుతుందని అంటున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
For More Telangana News And Telugu News