ACB Trap: ఏసీబీకి చిక్కిన శామీర్‌పేట ఎస్సై
ABN , Publish Date - Apr 29 , 2025 | 05:01 AM
ఓ కేసులో ఇద్దరు అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు తిరిగి ఇవ్వడానికి లంచం తీసుకున్న శామీర్‌పేట ఎస్సై పరశురామ్‌నాయక్ ఏసీబీకి చిక్కాడు.

నిందితుల ఫోన్లు తిరిగివ్వడానికి 25 వేల లంచం డిమాండ్
అప్పటికే ఫిర్యాదుదారు నుంచి 2 లక్షలు వసూలు చేసిన ఎస్సై
మూడుచింతలపల్లి, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): ఓ కేసులో ఇద్దరు అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు తిరిగి ఇవ్వడానికి లంచం తీసుకున్న శామీర్‌పేట ఎస్సై పరశురామ్‌నాయక్ ఏసీబీకి చిక్కాడు. అప్పటికే ఫిర్యాదుదారు నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకున్న ఎస్సై... అనుమానితుల నుంచీ రూ.22 వేలు లంచం దండుకున్నాడని ఏసీబీ అధికారులు తెలిపారు. కూకట్‌పల్లిలోని ఓ ఆయిల్ మిల్లులో చోరీ జరిగింది. నిందితులిద్దరూ శామీర్‌పేట్‌లో ఉంటున్నారని తెలుసుకున్న యజమాని.. ఎస్సై పరశురామ్‌నాయక్‌ను ఆశ్రయించాడు. ఎస్సై నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు ఆయిల్‌ను కొన్నామని చెప్పుకొచ్చారు. ఎస్సై యజమానిని పిలిపించి అడగ్గా ఆయిల్‌ను రికవరీ చేసి ఇవ్వాలని కోరాడు. దీనికి ఎస్పై రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు.
యజమాని దానికి అంగీకరించి కొన్నాళ్ల కిందట ఆ డబ్బు తీసుకొచ్చి.. ఎస్సై చెప్పినట్టే ఆయన కారులో పెట్టి వెళ్లిపోయాడు. మరోవైపు ఎస్సై ఇద్దరు నిందితుల నుంచి ముందే స్వాధీనం చేసుకున్న ఫోన్లను తిరిగి ఇవ్వడానికి రూ.25 వేలు డిమాండ్ చేశాడు. వారిద్దరూ బేరమాడి రూ.22 వేలకు ఒప్పించారు. ఆపై ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు సోమవారం ఎస్సైకు రూ.22 వేలు ఇవ్వడానికి వెళ్లారు. ఎస్సై చెప్పినట్లు టేబుల్ వద్ద ఉన్న డస్ట్‌బిన్‌లో వేసి బయటకు రాగానే ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఆ సొమ్మును స్వాధీనం చేసుకుని ఎస్సైను అదుపులోకి తీసుకున్నారు.