IAS transfers: చెప్పకుండానే నా శాఖలో ఇద్దరి బదిలీనా..?
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:00 AM
తనకు తెలియకుండా, కనీస సమాచారం లేకుండా.. తన శాఖలో కీలకమైన ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడంపై ఓ సీనియర్ మంత్రి షాక్‌కు గురయ్యారు.

వద్దని చెప్పాక కూడా ట్రాన్స్‌ఫర్ చేస్తారా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఓ మంత్రి
హైదరాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): తనకు తెలియకుండా, కనీస సమాచారం లేకుండా.. తన శాఖలో కీలకమైన ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడంపై ఓ సీనియర్ మంత్రి షాక్‌కు గురయ్యారు. ఆ ఇద్దరిలో ఒకరు బదిలీ అవుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. మరో ఐఏఎస్ అధికారి ఆ శాఖలో బాధ్యతలు తీసుకుని ఏడాది కూడా పూర్తి కాలేదు. ఆ ఐఏఎస్ బదిలీల జాబితాలో లేకున్నా.. చివరి నిమిషం ట్రాన్స్‌ఫర్ చేయడంపై సదరు సీనియర్ మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కచ్చితంగా బదిలీ అవుతారనుకున్న ఐఏఎస్ అధికారిని తన శాఖలోనే కొనసాగించాలని, ట్రాన్స్‌ఫర్ చేయవద్దని కొద్ది రోజుల క్రితమే ఆ మంత్రి ప్రభుత్వ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
ఆ వినతిని పరిగణనలోకి తీసుకోకుండా ఆ ఐఏఎస్ అధికారిని సైతం సర్కారు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ బదిలీల వ్యవహారంపై ఆ మంత్రి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఆయన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని ఇంట్లోనే ఉన్నారు. రాజ్‌భవన్‌లో లోకాయుక్త ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సి ఉన్నా.. దానికి సైతం డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. రోజంతా ముభావంగా ఉండటంతో పాటు సందర్శకులను సైతం కలవలేదని సమాచారం.