Share News

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీపై భద్రత కట్టుదిట్టం

ABN , Publish Date - Jul 26 , 2025 | 05:46 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. బ్యారేజీ పైనుంచి గతంలో అనుమతించిన కార్లు, ట్రాక్టర్లు వంటి లైట్‌ మోటర్‌ వాహనాల రాకపోకలను కూడా ప్రస్తుతం నిషేధించారు.

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీపై భద్రత కట్టుదిట్టం

  • భారీ వాహనాల రాకపోకలకు బ్రేక్‌

  • బైక్‌లు, పాదచారులకు అనుమతి

భూపాలపల్లి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. బ్యారేజీ పైనుంచి గతంలో అనుమతించిన కార్లు, ట్రాక్టర్లు వంటి లైట్‌ మోటర్‌ వాహనాల రాకపోకలను కూడా ప్రస్తుతం నిషేధించారు. కేవలం ద్విచక్ర వాహనాలు, పాదచారులకు మాత్రమే అనుమతినిస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీ్‌సఘఢ్‌ సరిహద్దుల్లోని సిరివంచ, అంబటిపలి,్ల కొత్తపల్లి, బీజాపూర్‌, నారాయణపూర్‌ ప్రాంతాలకు ఈ బ్యారేజీ అనుసంధానంగా ఉండేది. ఆయా ప్రాంతాల ప్రజలు వైద్యం వంటి అత్యవసర సేవల కోసం బ్యారేజీపై నుంచి రాకపోకలు సాగించేవారు. బ్యారేజీ దెబ్బతిన్న తర్వాత నీటిపారుదల శాఖ అధికారులు భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. కేవలం ట్రాక్టర్లు, అంబులెన్సులు, ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతించారు. అయితే బ్యారేజీ సెక్యూరిటీ సిబ్బందిపై మహారాష్ట్రకు చెందిన కొంతమంది వాహనదారులు దాడులకు పాల్పడుతుండడంతో అధికారులు సెక్యూరిటీ పోస్టును బ్యారేజీ నుంచి కొంత దూరానికి మార్చి ప్రస్తుతం రెండు వైపులా రాకపోకలను నియంత్రిస్తున్నారు. మహారాష్ట్ర వైపు ఉన్న గేటును శాశ్వతంగా మూసివేసి, భారీ వాహనాలను కాళేశ్వరం వంతెన మీదుగా మళ్ళిస్తున్నారు.


స్థానికులకు ప్రధాన రవాణా మార్గం

భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండలం అంబటిపల్లి, మహారాష్ట్రలోని సిరొంచ తాలూకాలోని కొత్తపల్లి ప్రాంతాలకు మేడిగడ్డ బ్యారేజీనే ప్రధాన మార్గంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని కొత్తపల్లి, తదితర గ్రామాల ప్రజలు తమ నిత్యవసరాలు మొదలుకుని విద్య, వైద్యం కోసం, వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవడం కోసం భూపాలపల్లి, వరంగల్‌ ప్రాంతాలకు వస్తుంటారు. సిరివంచ తాలూకాలో 70 శాతం జనాభా తెలుగువారే కావడంతో ఇరుప్రాంతాల మధ్య వివాహ సంబంధాలు కూడా కొనసాగుతున్నాయి. బ్యారేజీ నిర్మాణానికి ముందు గోదావరి దాటడానికి మహాదేవపూర్‌ మండలం కాళేశ్వరం మీదుగా సుదూరంగా ప్రయాణించి ట్రాక్టర్ల ద్వారా వడ్లు, పత్తి, మిర్చి పంటలను వ్యవసాయ మార్కెట్‌తో పాటు వరి కొనుగోలు కేంద్రాలకు తరలించేవారిమని రైతులు చెబుతున్నారు. తాజాగా బ్యారేజీపై రాకపోకలను నిలిపివేయడంతో మళ్లీ ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఈ వీడియోలను వీక్షించండి..

బెంబేలెత్తిస్తున్న అల్పపీడనం.. 4 రోజులు భారీ వర్షాలు!

గోవా గవర్నర్ గా రేపు అశోక్ గజపతి రాజు ప్రమాణస్వీకారం

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jul 26 , 2025 | 05:46 AM