Heatwave: మండే ఎండలు.. వడగండ్ల వానలు!
ABN , Publish Date - Apr 18 , 2025 | 03:57 AM
ఓ వైపు మండే ఎండలు.. మరోవైపు ఈదురుగాలులు, వడగండ్ల వానలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముఖ్యంగా అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి.

ఆదిలాబాద్ జిల్లా బేలలో 43.3 డిగ్రీలు
ఏటూరునాగారంలో వడదెబ్బకు ఒకరి మృతి
పలు జిల్లాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): ఓ వైపు మండే ఎండలు.. మరోవైపు ఈదురుగాలులు, వడగండ్ల వానలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముఖ్యంగా అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. గురువారం కూడా పొద్దంతా ఎండలు కాయగా.. సాయంత్రానికి చల్లబడి పలుచోట్ల వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో అత్యధికంగా 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గద్వాల జిల్లా మల్దకల్‌లో 42.6, ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 42.3, అదే జిల్లా తాంసిలో 42.2, జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో 41.7, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 41.6, కరీంనగర్ జిల్లా గంగాధరలో 41.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ములుగు జిల్లా ఏటూరునాగారంలో వ్యవసాయ కూలీ పలిశెట్టి వెంకటేశ్వర్లు (52) వడదెబ్బ తగిలి మృతి చెందాడు. ఇటు వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాల్లో కురిసిన వర్షాలతో పలు పంటలకు నష్టం వాటిల్లింది. వికారాబాద్ జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పెద్దేముల్, బొంరా్‌సపేట్, మర్పల్లి మండలాల్లో వడగండ్ల వాన కురిసింది.
వికారాబాద్, యాలాల్‌లో పలుచోట్ల చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. బొంరా్‌సపేట్ మండలంలోని మైసమ్మగడ్డ తండాలో పిడుగు పడి 20 గొర్రెలు మృతి చెందాయి. పూడూరు, దోమ మండలాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. తాండూరులో గంట సేపు భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఇందిరాచౌక్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్వాగత తోరాణం ఈదురుగాలులకు కుప్పకూలి రాకపోకలు స్తంభించాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్, జరాసంఘం మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఝరాసంగం మండలం కుప్పానగర్‌లో పిడుగుపాటుకు 23 మేకలు మృతి చెందాయి. మెదక్ జిల్లా నర్సాపూర్, పాపన్నపేట, చిన్నశంకరంపేట మండలాల్లో అక్కడక్కడ వడగళ్లు పడ్డాయి. పలుచోట్ల రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కోతకు వచ్చిన వరి పంట నేలకొరిగింది. ఆసిఫాబాద్‌లో అరగంట పాటు వర్షం కురిసింది. ఈదురు గాలుల తీవ్రతకు పట్టణంలో పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు కూలి కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 33ు పంటలకు నష్టం..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత రెండు రోజులుగా (మంగళ, బుధవారాల్లో) కురిసిన అకాల వర్షాలతో 33 శాతానికి పైగా పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా కల్లూరు, తల్లాడ, వైరా, మధిర, పెనుబల్లి మండలాల్లో వరి, మొక్కజొన్న, మామిడి, నువ్వు తదితర పంటలు దెబ్బతిన్నాయి. 2,947 ఎకరాల్లో వరి, 226 ఎకరాల్లో మామిడి, 37 ఎకరాల్లో మొక్కజొన్న, 12 ఎకరాల్లో నువ్వుల పంటలకు నష్టం జరిగింది. రైతులు కోతకు వచ్చిన వరితో పాటు మామిడి, కోసి ఉన్న మొక్కజొన్న పంటలు కోల్పోవడంతో తీవ్రంగా నష్టపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు మండలాల్లో పంట నష్టం ఎక్కువగా చోటుచేసుకుంది. అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చండ్రుగొండ, ములకలపల్లి మండలాల్లో 741 ఎకరాల్లో పలు పంటలకు నష్టం వాటిల్లింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Supreme Court: సెలవుల్లో బుల్డోజర్లు దింపాల్సిన అవసరం ఏంటి.. సర్కార్‌కు సుప్రీం సూటి ప్రశ్న
Faheem Fake Letter Controversy: సీఎంకు చెడ్డ పేరు వచ్చేలా చేయను.. చేయబోను