Share News

Bus Truck Collision: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 45 మంది సజీవదహనం

ABN , Publish Date - Nov 18 , 2025 | 05:53 AM

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉమ్రా యాత్ర కోసం హైదరాబాద్‌ నుంచి మక్కా వెళ్లిన 45 మంది యాత్రికులు సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు..

Bus Truck Collision: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 45 మంది సజీవదహనం

  • మృతుల్లో 44 మంది హైదరాబాదీలే.. వారిలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది..

  • మక్కా నుంచి మదీనా వెళ్తుండగా దుర్ఘటన.. డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టిన టూరిస్ట్‌ బస్సు

  • 46 మందిలో ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్కడు.. ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఉమ్రా యాత్రకు 54 మంది

  • బస్సు ఎక్కని 8 మంది హైదరాబాదీలు సురక్షితం.. వివరాలు వెల్లడించిన తెలంగాణ హజ్‌ కమిటీ

  • సౌదీలో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసిన భారత ఎంబసీ.. డీఎన్‌ఏ పరీక్షలతోనే మృతుల గుర్తింపు

  • మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం.. మంత్రి అజారుద్దీన్‌ ఆధ్వర్యంలో సౌదీకి ప్రతినిధులు

  • ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరిని పంపేలా ఏర్పాట్లు.. అక్కడే మృతులకు అంత్యక్రియలు

గల్ఫ్‌ ప్రతినిధి/హైదరాబాద్‌ సిటీ/న్యూ్‌సనెట్‌వర్క్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉమ్రా యాత్ర కోసం హైదరాబాద్‌ నుంచి మక్కా వెళ్లిన 45 మంది యాత్రికులు సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు.. డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొనడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగి, యాత్రికులు సజీవ దహనమయ్యారు. బస్సులో 46 మంది ఉండగా.. ఓ వ్యక్తి మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డారు. మక్కాలో ఉమ్రా చేసుకొని 440 కి.మీ. దూరంలోని మదీనాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. యాత్రికులు గాఢ నిద్రలో ఉండగా.. సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బస్సు, డీజిల్‌ ట్యాంకర్‌ ఢీకొన్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్రా యాత్రలో భాగంగా 54 మంది బృందం ఈ నెల 9న హైదరాబాద్‌ నుంచి జెడ్డాకు వెళ్లింది. ఈ నెల 23 వరకు వివిధ ప్రాంతాలను సందర్శించుకునే విధంగా వారు పర్యటనను రూపొందించుకున్నారు. ఆదివారం మక్కా యాత్రను ముగించుకున్న తర్వాత 46 మంది మదీనాకు బస్సులో బయలుదేరారు. మిగతా 8 మందిలో నలుగురు మక్కాలోనే ఉండగా.. మరో నలుగురు మదీనాకు కారులో వెళ్లారు. అయితే యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు.. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలోని ముఫ్రిహాత్‌ వద్ద డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి 45 మంది కాలి బూడిదైపోయారు. బస్సులో ప్రయాణిస్తున్న అబ్దుల్‌ షోయబ్‌(25) మాత్రం గాయాలతో బయటపడ్డాడు. అతను మదీనాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ విలేకరులకు తెలిపారు. 45 మందిలో 44 మంది హైదరాబాద్‌ వాసులు కాగా.. ఓ వ్యక్తి హుబ్లీకి చెందిన వారని తెలంగాణ హజ్‌ కమిటీ తెలిపింది. మృతులు హైదరాబాద్‌లోని మల్లేపల్లి, బజార్‌ఘాట్‌, ఆసి్‌ఫనగర్‌ వాసులని పేర్కొంది. మృతుల్లో 18 మంది మహిళలు, 17 మంది పురుషులు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. విద్యానగర్‌లోని ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మరణించారు.


accident.jpg

టప్పాచబుత్రలోని ఓ కుటుంబానికి చెందిన ఆరుగురు, మొఘల్‌కానాలోని ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు, జిర్రాలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన వారిలో ఉన్నారు. మొత్తం నాలుగు ప్రైవేట్‌ ట్రావెల్‌ ఏజెన్సీల ద్వారా వెళ్లారని, ఎవరూ హజ్‌హౌస్‌ ద్వారా వెళ్లలేదని హజ్‌ కమిటీ స్పష్టం చేసింది. ఇది హజ్‌ యాత్రకు వెళ్లే సమయం కాదంది. ఉమ్రా యాత్రకు ఎప్పుడైనా వెళ్లవచ్చని తెలిపింది. హజ్‌ యాత్రకు, ఉమ్రా యాత్రకు సంబంధం ఉండదని వివరించింది. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో తెలంగాణ సచివాలయంలోనూ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. వివరాల కోసం 79979 59754, 99129 19545 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు. రోడ్డు ప్రమాద బాధితుల కోసం హైదరాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, 040 27852333 లేదా ఇన్‌స్పెక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ 87126 60381ను సంప్రదించాలని సీపీ సజ్జనార్‌ చెప్పారు.

మూడు ఆస్పత్రుల్లోని శవాగారాలకు..

ప్రమాదస్థలికి హుటహుటిన చేరుకున్న సౌదీ సహాయక బృందాలు మృతదేహలను మదీనాలోని 3 ఆస్పత్రుల్లో ఉన్న శవాగారాలకు తరలించారు. మృతుల వివరాలను తెలుసుకోవడానికి జెడ్డాలోని భారత కాన్సుల్‌ జనరల్‌ ఫహాద్‌ ఖాన్‌ సూరి, ఇతర ఉన్నతాధికారుల బృందం మదీనా చేరుకుంది. మృతదేహాల గుర్తింపు, అంత్యక్రియలను వీలైనంత త్వరగా జరిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫహాద్‌ ఖాన్‌ తెలిపారు.

దుబాయ్‌ నుంచి వచ్చి.. కుటుంబ సభ్యులతో వెళ్లి..

ఘటనలో మృతి చెందిన ఇర్ఫాన్‌ అహ్మద్‌ (45) దుబాయ్‌లో పనిచేస్తుంటారు. ఆయన కుటుంబం హైదరాబాద్‌లోని మొఘల్‌కానా ప్రాంతంలో ఉంటుంది. తల్లి సబీబా సుల్తానా (67), భార్య హుమీరా నజీన్‌ (32), కుమారులు ఇజాన్‌ అహ్మద్‌ (8), హమీద్‌ అహ్మద్‌(6)ను ఉమ్రా యాత్రకు తీసుకెళ్లేందుకు ఈ నెల 7న ఇర్ఫాన్‌ హైదరాబాద్‌ వచ్చారు. 9న కుటుంబ సభ్యులను యాత్రకు తీసుకెళ్లారు. తండ్రి సలీం అహ్మద్‌ మాత్రం ఇంటి వద్దే ఉండిపోయారు. నాలుగు రోజుల్లో వస్తారనుకున్న కుటుంబ సభ్యులు తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో సలీం గుండెలవిసేలా రోదిస్తున్నారు.


మంత్రి అజారుద్దీన్‌ పరామర్శ

సౌదీ రోడ్డు ప్రమాద మృతుల కుటుంబ సభ్యులను సోమవారం మంత్రి అజారుద్దీన్‌ పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఆసి్‌ఫనగర్‌, నటరాజ్‌నగర్‌లోని అబ్దుల్‌ ఖాదర్‌, మహ్మద్‌ అలీల కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌ టూ సౌదీ అరేబియా..

ఉమ్రా యాత్ర చేయడానికి రోజూ వందలాది మంది యాత్రికులు హైదరాబాద్‌ నుంచిసౌదీ అరేబియాకు వెళ్తుంటారు. మక్కా, మదీనాలను సందర్శించి వస్తారు. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 200 వరకు వివిధ టూర్‌ ఆపరేటర్లు ఉమ్రా యాత్రలను నిర్వహిస్తుంటారు. మక్కా, మదీనాల మధ్య 440 కిలోమీటర్ల హైవేపై నిరంతరం వేలాది మంది బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. అతి వేగం, నిద్రలేమి కారణాలతో అప్పుడప్పుడు ఇలాంటి ఘోర ప్రమాదాలు జరుగుతుంటాయి.

రెండు వారాలు.. అంతకంటే ఎక్కువే కావచ్చు..

సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్‌ దేశాల నిబంధనల ప్రకారం అగ్నిప్రమాద మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు చేసిన తర్వాతే వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. డీఎన్‌ఏ పరీక్షల ఫలితాలు రావడానికి వారం, రెండు వారాలు.. అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. తాజాగా హైదరాబాద్‌లో అధికారులు ప్రకటించిన విధంగా మృతుల కుటుంబాల నుంచి ఒక్కొక్కరు సౌదీ వచ్చినా.. డీఎన్‌ఏ ఫలితాలు వచ్చి, మృతదేహాలు అప్పగించేదాకా వారు అక్కడే ఉండాలి.

Updated Date - Nov 18 , 2025 | 06:45 AM