Sammakka Sagar Mulugu: ‘సమ్మక్కసాగర్’ ముంపు 100 ఎకరాలే!
ABN , Publish Date - Jul 19 , 2025 | 04:17 AM
గోదావరి నదిపై ములుగు జిల్లాలో నిర్మిస్తున్న సమ్మక్కసాగర్ (తుపాకులగూడెం) బ్యారేజీ అనుమతులకు మార్గం సుగమమైంది.

ఛత్తీస్‌గఢ్‌లో ముంపుపై ఐఐటీ-ఖరగ్‌పూర్ నివేదిక
హైదరాబాద్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): గోదావరి నదిపై ములుగు జిల్లాలో నిర్మిస్తున్న సమ్మక్కసాగర్ (తుపాకులగూడెం) బ్యారేజీ అనుమతులకు మార్గం సుగమమైంది. సమ్మక్కసాగర్ బ్యారేజీతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి కలిగే ముంపు ముప్పుపై ఐఐటీ-ఖరగ్‌పూర్‌తో అధ్యయనం చేయించారు. బ్యారేజీ వద్ద 87 మీటర్ల గరిష్ఠ వరదతో బీజాపూర్ జిల్లాలోని పోటూరు, కౌటూరు, తుర్లగూడ, గంగారం, కంబాలపేట, సీతానగరంలో 100 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. సమ్మక్కసాగర్‌కు కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)లోని డైరెక్టరేట్లన్నీ అనుమతులు ఇవ్వగా.. అంతర్రాష్ట్ర విభాగం ఒక్కటే అభ్యంతరం తెలిపింది.
అనుమతి కావాలంటే ఛత్తీస్‌గఢ్ నుంచి నిరభ్యంతర పత్రం తెచ్చుకోవాలని తేల్చిచెప్పింది. బ్యారేజీ పూర్తిస్థాయి నీటినిల్వ 83 మీటర్లు కాగా.. అక్కడిదాకా ముంపునకు గురయ్యే భూములకే పరిహారం చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే చెప్పింది. అయితే గరిష్ఠ వరద 2022 జూలై 17, 19వ తేదీల్లో 88 మీటర్ల దాకా రికార్డయిందని, ఆ మేరకు ముంపునకు గురయ్యే భూములకు కూడా పరిహారం చెల్లించాల్సిందేనని ఛత్తీస్‌గఢ్ పట్టుబట్టింది. తాజాగా ఐఐటీ-ఖరగ్‌పూర్‌తో అధ్యయనం చేయించగా, స్పష్టత వచ్చింది. ఆ మేరకు భూములకు ఇవ్వాల్సిన పరిహారాన్ని బీజాపూర్ కలెక్టర్ వద్ద జమ చేయించిన తర్వాత ఛత్తీస్‌గఢ్ నుంచి ఎన్‌వోసీ లేదా అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకుంటే మార్గం సుగమం కానుంది.