Bus Fares: ‘టోలు’ తీస్తున్న ఆర్టీసీ
ABN , Publish Date - Jun 19 , 2025 | 03:12 AM
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) టోల్ ట్యాక్స్ పెంచిందన్న సాకుతో ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులపై అదనపు చార్జీల భారాన్ని మోపుతోంది.

అన్ని ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో టికెట్ రేట్లు రూ.10 పెంపు
ఇప్పటికే టోల్ గేట్లు ఉన్న మార్గాల్లో ఒక్కో టోల్‌గేటుకు
రూ.10చొప్పున అదనంగా వసూలు
తాజాగా హేతుబద్ధీకరణ పేరిట అన్ని ఎక్స్‌ప్రె్‌సల్లో పెంపు
కూర్చోవడానికి సీట్లే లేవంటే చార్జీలు పెంచడం
ఏంటని మండిపడుతున్న ప్రయాణికులు
సుభా్‌షనగర్/పెద్దపల్లి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) టోల్ ట్యాక్స్ పెంచిందన్న సాకుతో ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులపై అదనపు చార్జీల భారాన్ని మోపుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా టోల్ గేట్లు ఉన్న రూట్లలో ఎక్స్‌ప్రెస్ బస్సుల నుంచి టోల్‌గేటుకు రూ.10 చొప్పున ప్రయాణికుల నుంచి వసూలు చేస్తోంది. తాజాగా రేషనలైజేషన్ పేరిట రాష్ట్రంలోని అన్ని రకాల ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసుల్లో టికెట్ రేట్లను రూ.10 పెంచింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే మూడు టోల్‌గేట్లు దాటాల్సి ఉండటంతో ఇప్పటికే ఉన్న టికెట్ రేటుకు అదనంగా ఆర్టీసీ ప్రయాణికుల నుంచి రూ.30 వసూలు చేస్తోంది. గతంలో హైదరాబాద్‌కు ఏసీ బస్సుల్లో టికెట్ రూ.430 ఉండగా ప్రస్తుతం రూ.460 వసూలు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్, ఎలక్ట్రిక్ బస్సుల్లో టికెట్ రూ.360 ఉండగా 390కి పెంచారు. హైదరాబాద్ నుంచి రామగుండం వెళ్లే మార్గంలోనూ 3 టోల్‌గేట్లు ఉన్నాయి. ఈ మార్గంలోనూ ప్రయాణికుల నుంచి అదనంగా రూ.30వసూలు చేస్తున్నారు. తాజాగా కిలోమీటర్ల రేషనలైజేషన్ పేరిట అన్ని ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో టికెట్ల రేట్లను ప్రస్తుత చార్జీలతో సంబంధం లేకుండా రూ.10చొప్పున పెంచారు.
కరీంనగర్ నుంచి పెద్దపల్లి వరకు ఎక్స్‌ప్రెస్ టికెట్ రూ.60 నుంచి రూ.70కి పెంచారు. కరీంనగర్ నుంచి మంథని వరకు రూ.100 నుంచి 110కి పెంచారు. గతంలో చిల్లర సమస్య సాకుతో టికెట్ రేట్లను రౌండ్ ఫిగర్ చేస్తున్నామని చెప్పి చార్జీలను పెంచారు. కరోనా పేరిట మూడుసార్లు రూ.5 చొప్పున పెంచారు. ఎలక్ట్రికల్ బస్సుల్లో గ్రీన్ టాక్స్ పేరిట అదనంగా రూ. 10 వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ తాజా నిర్ణయంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అసలే బస్సుల్లో కూర్చునేందుకు సీట్లు లేవంటే టికెట్ రేట్లను పెంచడం ఏంటని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి.. పురుషులపై అదనపు భారం మోపడంపైనా విమర్శలు వస్తున్నాయి. టికెట్ల పెంపుపై నిజామాబాద్ రీజియన్ మేనేజర్ జ్యోత్స్నను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ఎన్‌హెచ్‌ఏఐ టోల్ టాక్స్ పెంచడం వల్లనే టికెట్ల ధరలను పెంచినట్లు ఆమె తెలిపారు.