CM Revanth Reddy: కేసీఆర్ వల్లే పాలమూరు ప్రాజెక్టు పూర్తి కాలే: రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - Jul 18 , 2025 | 06:38 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టుతోపాటు దిండి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులను అడ్డగించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే సమయంలో కేసీఆర్ గత ప్రభుత్వ పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

నాగర్ కర్నూల్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడంలో తన నిబద్ధతను ప్రకటించారు. ఈ ప్రాజెక్టుతోపాటు దిండి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ వంటి కీలక ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రద్దు చేసుకోవాలని, అందుకు సహకరించాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. సహకారం లేకపోతే పోరాటం తప్పదని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడం తన బాధ్యత అంటూ స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
మరో పదేళ్లు నేనే సీఎం..
అంతేకాదు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఉద్దేశిస్తూ 'నీ గుండె, నీ కుమారుడి గుండె మీద కూడా రాసుకో.. మరో పదేళ్లు నేనే సీఎంగా ఉంటా' అని రేవంత్ పేర్కొన్నారు. ఈ పాలమూరు బిడ్డే తెలంగాణను ప్రజా ప్రభుత్వంతో నడిపిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలని, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి నేర్చుకోవాలని హితబోధ చేశారు రేవంత్. 'నీకు దుఃఖమొస్తే ఏడ్చినా, బావిలో దూకినా, నీ ఇష్టం' కానీ తెలంగాణ ప్రజల కోసం తాము చేసే మంచి పనులను చూస్తూ ఉండాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే పాలమూరు ప్రాంతం సస్యశ్యామలంగా మారి, రైతుల జీవనోపాధికి బలమైన ఆధారంగా నిలుస్తాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
రూ.200 కోట్ల వ్యయంతో...
నాగర్‌కర్నూల్ జిల్లా జటప్రోలులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా పాలమూరు ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపిరి లభించింది. ఈ సందర్భంగా రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన జరిగింది. ఈ స్కూల్ విద్యార్థులకు ఆధునిక విద్య, సౌకర్యాలతో ఉజ్వల భవిష్యత్తును అందించనుంది. ఈ సందర్భంగా కొల్లాపూర్ అభివృద్ధికి అవసరమైన నిధులను పూర్తిగా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
పాలమూరు పట్ల కేసీఆర్‌కు చిన్నచూపు
గతంలో కేసీఆర్ నాయకత్వంలో పాలమూరు పట్ల నిర్లక్ష్యం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్.. పాలమూరు ప్రజల సమస్యలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. వరద బాధితులకు ఇళ్లు కట్టిస్తానని చెప్పిన కేసీఆర్.. ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదన్నారు. రూ.25వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇప్పటికే పూర్తయ్యేదన్నారు రేవంత్. అదే సమయంలో రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడేళ్లలో కూలేశ్వరంగా మారిందని ఎద్దేవా చేశారు.
ప్రాజెక్టులకు కొత్త ఊపు
ఈ సందర్భంగా సీఎం రేవంత్, పాలమూరు ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్‌లోగా భూసేకరణ పూర్తి చేసి, కృష్ణా జలాలను పొలాలకు తీసుకొస్తామని అన్నారు. 'మా పొలాల్లో కృష్ణా నీళ్లు పారుతుంటే, కొందరు దీనిని ఓర్చుకోలేకపోతున్నారు. కేసీఆర్ లాంటి వాళ్లు విషం చిమ్ముతున్నారని' రేవంత్ వ్యాఖ్యానించారు. పాలమూరు పచ్చగా మారితే, రైతులు సంతోషంగా ఉంటారని, అది కొందరికి కడుపుమంటగా ఉందని మండిపడ్డారు.
రైతులకు రుణమాఫీ, బోనస్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.21వేల కోట్ల రైతు రుణమాఫీ చేసినట్లు సీఎం రేవంత్ తెలిపారు. 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేశామని, వరి పండించిన రైతులకు బోనస్ కూడా ఇస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదని కొందరు అన్నారని, కానీ తాము 24 గంటలూ ఉచిత కరెంటు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మహిళల సాధికారతకు పెద్దపీట
మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, వెయ్యి బస్సులకు మహిళలను యజమానులుగా చేశామని అన్నారు. రూ.21వేల కోట్ల వడ్డీ లేని రుణాలు, పెట్రోల్ బంక్‌లకు యజమానులుగా, సోలార్ విద్యుత్ కాంట్రాక్టులు ఇచ్చి మహిళలను సాధికారత వైపు నడిపిస్తున్నామని వివరించారు. కేసీఆర్ తన బిడ్డకు బంజారాహిల్స్‌లో బంగ్లా కట్టించారు. కానీ తాము తెలంగాణ ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.
దళితులు, ఆదివాసీలకు న్యాయం
కేసీఆర్ హయాంలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ హామీలు నెరవేరలేదని రేవంత్ విమర్శించారు. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేసీఆర్ చెప్పి, ఎందుకు చేయలేదన్నారు. దళిత బిడ్డలు చదువుకుంటే, రాజ్యాలు ఏలితే కొందరికి దుఃఖం వస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగ కులాల వర్గీకరణ చేసి న్యాయం చేసిందని రేవంత్ తెలిపారు.
2035 నాటికి తెలంగాణను ట్రిలియన్ ఎకానమీగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. పాలమూరు పచ్చగా మారాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లక్ష్యం కోసం కృషి చేస్తోందని సీఎం స్పష్టం చేశారు. పాలమూరు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు సాధికారత, ప్రాజెక్టుల పూర్తితో పాలమూరు కొత్త ఒరవడిని సాధిస్తుందని రేవంత్ హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి