Share News

Arrest: వివాహితను చంపిన ఆర్‌ఎంపీ అరెస్టు

ABN , Publish Date - Jul 04 , 2025 | 03:46 AM

వివాహితపై లైంగిక దాడి చేసి, ఆమె అడ్డు తొలగించుకునేందుకు గడ్డిమందు ఇంజక్షన్‌ ఎక్కించి బాధితురాలి మరణానికి కారకుడైన ఆర్‌ఎంపీ డాక్టర్‌ మహేశ్‌ను గుర్రంపోడు పోలీసులు అరెస్టు చేశారు.

Arrest: వివాహితను చంపిన ఆర్‌ఎంపీ అరెస్టు

గుర్రంపోడు, జులై 3 (ఆంధ్రజ్యోతి): వివాహితపై లైంగిక దాడి చేసి, ఆమె అడ్డు తొలగించుకునేందుకు గడ్డిమందు ఇంజక్షన్‌ ఎక్కించి బాధితురాలి మరణానికి కారకుడైన ఆర్‌ఎంపీ డాక్టర్‌ మహేశ్‌ను గుర్రంపోడు పోలీసులు అరెస్టు చేశారు. కొండమల్లేపల్లి సీఐ నవీన్‌కుమార్‌ గురువారం వివరాలను వెల్లడించారు. గుర్రంపోడు మండలానికి చెందిన ఆర్‌ఎంపీ మహేశ్‌ ఏడాదిగా ఓ వివాహితతో సన్నిహితంగా ఉన్నాడు. ఆమె తనపై కేసులు పెడతానని, తాము ఏకాంతంగా ఉన్నప్పటి ఫొటోలు, వీడియోలు ఉన్నాయని హెచ్చరించడంతో.. అడ్డు తొలగించుకోవడానికి పథకం పన్నాడు. గత నెల 29న రాత్రి 8.30 సమయంలో కొండమల్లేపల్లి బస్టాండ్‌ వద్ద ఆమెను కారులో ఎక్కించుకుని, నల్లగొండ వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో.. కొప్పోలు సమీపంలో కారును ఆపాడు. ఆమె వద్దంటున్నా వినకుండా.. లైంగిక దాడికి పాల్పడ్డాడు. ‘‘నువ్వు బలహీనంగా కనిపిస్తున్నావు. ఈ మాత్రలు వేసుకో’’ అని పేర్కొంటూ.. 8 ట్యాబ్లెట్లను మింగించాడు.


గడ్డిమందు ఇంజక్షన్‌ చేశాడు. అదే ఇంజక్షన్‌ను నీటిలో కలిపి, బలవంతంగా తాగించాడు. ఇక ఆమె చనిపోతుందని నిర్ధారించుకుని, కారును ముందుకు పోనిచ్చాడు. కొంత దూరం వెళ్లాక తనకు వాంతి అవుతుందని బాధితురాలు చెప్పడంతో.. దేవరకొండ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. గడ్డిమందు తాగిందని చెబుతూ.. ఆమెను ఆస్పత్రిలో చేర్పించి పారిపోయాడు. పరిస్థితి విషమించి, బాధితురాలు చనిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. మహేశ్‌ని గురువారం అరెస్టు చేశారు. వివాహిత మరణానికి కారణమైన సిరంజీలు, ట్యాబ్లెట్లు, గడ్డి మందు డాబ్బా, కారు, సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేశారు. కాగా.. బాధితురాలు చనిపోయిన రోజు పోలీసుల కథనం మరోలా ఉన్న విషయం తెలిసిందే..! రోడ్డు పక్కన నిలిపిన కారులో కొన ఊపిరితో ఉన్న బాధితురాలిని తామే ఆస్పత్రిలో చేర్పించాలమని తొలుత పోలీసులు పేర్కొన్నారు. తాజాగా సీఐ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాత్రం.. నిందితుడు మహేశ్‌ ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.

Updated Date - Jul 04 , 2025 | 03:46 AM