Skin Care: వయసు పెరగొద్దు మెరుపు తరగొద్దు!
ABN , Publish Date - Aug 03 , 2025 | 04:22 AM
వయసు కనిపించొద్దు.. చర్మం ముడతలు పడొద్దు.. లావుగా అనిపించొద్దు.. నిత్యం యవ్వనంగా మెరుస్తూ, మురిసిపోవాలి.. ఇటీవల ఎంతో మందిలో కనిపిస్తున్న ఆశ ఇది.

ఎంత డోసు అయినా.. ఎంత ఖర్చయినా.. వయసు కనిపించకుండా తంటాలు
విచ్చలవిడిగా యాంటీ ఏజింగ్ మందుల వినియోగం.. అవయవాలపై తీవ్ర ప్రభావం
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): వయసు కనిపించొద్దు.. చర్మం ముడతలు పడొద్దు.. లావుగా అనిపించొద్దు.. నిత్యం యవ్వనంగా మెరుస్తూ, మురిసిపోవాలి.. ఇటీవల ఎంతో మందిలో కనిపిస్తున్న ఆశ ఇది. మధ్య వయసుకు వస్తుండగానే చర్మం వదులై, మెరుపు కోల్పోవడం, పొట్ట వద్ద ఉబ్బెత్తుగా మారుతుండటాన్ని చూసి.. ఎక్కడ వయసు మీదపడినట్టు కనిపిస్తామేమోనని చాలా మంది మదనపడిపోతున్నారు. సినీ, టీవీ, మోడలింగ్ రంగాలవారు మొదలు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, ఉద్యోగులు, సాధారణ గృహిణుల దాకా ఈ ఆందోళన కనిపిస్తోంది. దీనితో వయసు తక్కువగా కనిపిస్తుందని చెప్పే ‘యాంటీ ఏజింగ్’ మందులవైపు చూస్తున్నారు. కొందరు వైద్యుల సలహాతో సాధారణ మోతాదుతో మొదలుపెట్టి, అధిక డోసులకు మారుతుంటే.. మరికొందరు సోషల్ మీడియాలో, ఇంటర్నెట్‌లో చూసి నేరుగా కొనితెచ్చుకుంటున్నారు. విచ్చలవిడిగా, అధిక మోతాదుల్లో యాంటీ ఏజింగ్ మందుల వాడకంతో శరీరంలో అవయవాలు దెబ్బతిని దీర్ఘకాలిక అనారోగ్యాల పాలవుతున్నారు.
ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు..
ఇటీవల ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందిన ‘కాంటాలగా’ మ్యూజిక్ ఆల్బమ్ ఫేమ్ షెఫాలీ.. పరిమితికి మించి యాంటీ ఏజింగ్ మందులు వినియోగించేవారని గుర్తించారు. ఇక కొన్నాళ్లక్రితం ఓ టీవీ యాంకర్ ఓ వైద్యుడి వద్దకు వెళ్లి యాంటీ ఏజింగ్ మందులు రాయించుకున్నారు. ఆయన తక్కువ మోతాదులో మందులు రాశారు. కానీ ఆమె మెల్లమెల్లగా అధిక డోసులు తెచ్చుకుని వాడటం మొదలుపెట్టారు. ఇది వికటించి పాంక్రియాస్ గ్రంధిపై తీవ్ర ప్రభావం పడి.. ప్రాణాల మీదకు వచ్చింది. వీరేకాదు.. చాలా మంది వయసు కనబడకుండా ఉండాలనే ఉద్దేశంతో యాంటీ ఏజింగ్ మందులవైపు చూస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ఆ మందుల దుష్పరిణామాలను తెలుసుకోకుండా ఇబ్బందిపడుతున్నారని, పరిమితికి మించి వాడితే సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
వయసు.. ఎంత తగ్గినా రెండేళ్లే!
యాంటీ ఏజింగ్ మందుల వల్ల ప్రయోజనం తాత్కాలికం, స్వల్పమేనని వైద్యులు చెబుతున్నారు. ఆహారం, వ్యాయామం, ఇతర అలవాట్లను మార్చుకోకుండా కేవలం యాంటీ ఏజింగ్ మందులు వాడితే.. మహా అయితే ఏడాది, రెండేళ్ల మేర వయసు తక్కువగా కనిపించే అవకాశం మాత్రమే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. చాలా మంది ఐదు, పదేళ్ల వయసు తక్కువగా ఉండేలా కనిపించాలని కోరుతున్నారని చెబుతున్నారు. ఇక యాంటీ ఏజింగ్ మందులు వినియోగించడం మొదలుపెట్టిన ఏడా ది, రెండేళ్లపాటు మాత్రమే సమర్థంగా పనిచేస్తాయని.. ఆ తర్వాత వాటితో ఉపయోగం ఉండదని వివరిస్తున్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా వయసు పెరిగినట్టు కనిపిస్తారని పేర్కొంటున్నారు.
అవయవాలపై తీవ్ర ప్రభావం..
యాంటీఏజింగ్ మందుల దీర్ఘకాలిక వినియోగం, అధిక మోతాదుల కారణంగా శరీరంలోని కీలక అవయవాలపై ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యాంగ్జైటీ, నిద్రలేమి, కుంగుబాటు, రక్తపోటులో తీవ్ర హెచ్చతగ్గులు, కీళ్ల నొప్పులు, చర్మం సన్నబడటం, కిడ్నీ, కాలేయం, పాంక్రియాస్, జీర్ణవ్యవస్థలో సమస్యలు తలెత్తే ప్రమాదముంటుందని.. కొన్నిమందులతో క్యాన్సర్ బారినపడే ముప్పు పెరుగుతుందని స్పష్టం చేస్తున్నారు.
మంచి జీవన శైలితోనే అందంగా..
ఆరోగ్యకరమైన ఆహారం, నిత్యం వ్యాయామం, పండ్లు, కూరగాయలు తీసుకుంటూ మంచి జీవన శైలిని పాటిస్తే అందంగా కనిపించవచ్చు. అనవసరంగా యాంటీ ఏజింగ్ మందులు వినియోగించి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవద్దు. కృత్రిమ మందులతో ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరించడం సరికాదు.
- డాక్టర్ రాజశేఖర్ మాదాల, కాస్మోటిక్ సర్జన్
గుండె జబ్బులు వచ్చే ముప్పు
వయసును ఎవరూ ఆపలేరు. శరీరంలో సహజంగా జరిగే మార్పులను బలవంతంగా మందులతో నిలువరించడం సాధ్యం కాదు. కొందరు బలమైన కండరాలు, దేహ దారుఢ్యం కోసం స్టెరాయిడ్స్ వాడుతున్నారు. ఇవి గుండె సమస్యలకు దారితీస్తాయి. అవయవాలు విఫలమై ప్రాణాల మీదకు వస్తుంది.
- డాక్టర్ రాహుల్ అగర్వాల్, కేర్ క్లినికల్ డైరెక్టర్
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి
ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్
Read latest Telangana News And Telugu News