Share News

Heart Disease: పాతికేళ్లకే కుప్పకూలుతున్నారు!

ABN , Publish Date - Jul 29 , 2025 | 05:13 AM

పాతికేళ్లకే గుండె లయ తప్పుతోంది. అప్పటివరకు ఆడి పాడిన యువత.. చూస్తుండగానే కుప్పకూలిపోతోంది. ఇటీవల ఈ తరహా కేసులు ఎక్కువవుతున్నాయి.

Heart Disease: పాతికేళ్లకే కుప్పకూలుతున్నారు!

  • 20-30 ఏళ్ల వారిలో పెరుగుతున్న హృద్రోగాలు

  • జన్యు పర, పుట్టుకతో గుండె సమస్యలుంటే అధిక శారీరక శ్రమతో గుండెపోటు

  • అధిక కొవ్వు, ధూమపానమూ ముప్పే

హైదరాబాద్‌ సిటీ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): పాతికేళ్లకే గుండె లయ తప్పుతోంది. అప్పటివరకు ఆడి పాడిన యువత.. చూస్తుండగానే కుప్పకూలిపోతోంది. ఇటీవల ఈ తరహా కేసులు ఎక్కువవుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో షటిల్‌ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో కుప్పకూలి మరణించిన ఘటన ఆందోళన రేకెత్తిస్తోంది. తమ వద్దకు వచ్చే గుండె జబ్బు బాధితుల్లో యువకులే ఎక్కువగా ఉంటున్నారని హృద్రోగ నిపుణులు కూడా చెబుతున్నారు. ఒకప్పుడు 50, 60 ఏళ్ల వయసు దాటిన వారిలోనే కనిపించే గుండె జబ్బులు.. ఇప్పుడు 20-30 ఏళ్ల వయసు వారిలోనూ చోటు చేసుకుంటున్నాయని హెచ్చరిస్తున్నారు. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడడం, కండరాల వాపు వంటి వాటితో పాటు అంతకుముందు కుటుంబంలో ఎవరికో ఒకరికి ఈ జబ్బులు ఉంటేఈ పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. చిన్నప్పటి నుంచే జంక్‌ ఫుడ్‌ను అధిక మొత్తంలో తీసుకుంటుండటం వల్ల కొవ్వు శాతం పెరిగి గుండె స్పందనల్లో తేడాలొస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కొందరికి పుట్టుకతోనే గుండె జబ్బులు వస్తాయంటున్నారు. ఇక మాదక ద్రవ్యాలు, ధూమపానం, మద్యపానం చేసే వారిలోనూ గుండె సమస్యలొచ్చే ముప్పు అధికమని అంటున్నారు. అందుకే 25 ఏళ్లు దాటినప్పటి నుంచే గుండె ఆరోగ్యాన్ని తెలిపే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.


గుర్తించని గుండె సమస్యలు..

‘కొంతమంది యువకుల్లో జన్యుపరమైన లేదా పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు ఉండవచ్చు. దీంతో తీవ్రమైన శారీరక శ్రమ లేదా ఒత్తిడి సమయంలో ఆకస్మిక గుండెపోటుకు దారితీయవచ్చు. అలాగే మధుమేహం, అధిక రక్తపోటు రక్తనాళాలను దెబ్బతీసి, కొవ్వు పేరుకుపోయి గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. మధుమేహాం ఉంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువ ముప్పు. కొవిడ్‌ వైరస్‌ గుండె కండరాలకు వాపు (మయోసైటిస్‌) కలిగించవచ్చు. ఇది కూడా గుండె పోటు ప్రమాదాన్ని పెంచవచ్చు. యువతలో గుండెపోటు నివారించడానికి పండ్లు, కూరగాయలు, చేపలు, చికెన్‌, తృణధాన్యాల వంటి ఆహారాన్ని తీసుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి’

- శరత్‌రెడ్డి, మెడికవర్‌ ఆస్పత్రి హృద్రోగ నిపుణుడు


తొలి గంటలోనే చికిత్స అత్యవసరం

‘అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే వారిలో సగం మంది ఆస్పత్రికి చేరకుండానే మరణిస్తున్నారు. గుండెపోటు వచ్చిన తొలి గంట (గోల్డెన్‌ అవర్‌) లోనే తక్షణ చికిత్స అందిస్తే బాధితుడి ప్రాణాన్ని కాపాడవచ్చు. రోగికి తక్షణమే కార్డియో పల్మోనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌) చేయాలి.. లేదంటే మరణం సంభవిస్తుంది’

- వీఎస్‌ రామచంద్ర, శ్రీశ్రీ హోలిస్టిక్‌ ఆస్పత్రి చీఫ్‌ కార్డియాలజిస్టు


ఇవి కూడా చదవండి..

కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు, మోదీకి ఫోన్ కాల్ రాలేదు

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 05:14 AM