Share News

CM Revanth Reddy: ఆ ఘ‌న‌త మౌలానా అబుల్ క‌లాం ఆజాద్‌కే ద‌క్కుతుంది: సీఎం రేవంత్

ABN , Publish Date - Nov 10 , 2025 | 07:49 PM

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా విద్యారంగ ప్రగతికి ఆజాద్ చేసిన సేవ‌ల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. మహనీయుడి జయంతి రోజునే జాతీయ విద్యా దినోత్సవం (న‌వంబ‌రు 11) నిర్వహించుకుంటున్నామని చెప్పారు. ఆజాద్ స్పూర్తితో విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.

CM Revanth Reddy: ఆ ఘ‌న‌త మౌలానా అబుల్ క‌లాం ఆజాద్‌కే ద‌క్కుతుంది: సీఎం రేవంత్
CM Revanth Reddy

హైదరాబాద్, నవంబర్ 10: భార‌త దేశ తొలి విద్యా శాఖ మంత్రిగా ప‌ని చేసి దేశ విద్యా రంగానికి పునాదులు వేసిన ఘ‌న‌త మౌలానా అబుల్ క‌లాం ఆజాద్‌కే ద‌క్కుతుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. మౌలానా జయంతి సందర్భంగా విద్యారంగ ప్రగతికి ఆయన చేసిన సేవ‌ల‌ను ముఖ్య‌మంత్రి స్మరించుకున్నారు. మహనీయుడి జయంతి రోజునే జాతీయ విద్యా దినోత్సవం (న‌వంబ‌రు 11) నిర్వహించుకుంటున్నామని చెప్పారు. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మన్‌గా, వయోజన అక్షరాస్యత, సార్వత్రిక ప్రాథమిక విద్య, 14 సంవత్సరాల్లోపు బాలబాలికలందరికీ నిర్బంధ ఉచిత విద్య‌, వృత్తి శిక్షణల‌తో పాటు యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ ఏర్పాటు వంటి విభిన్న‌ విధానాలతో దేశంలో విద్యారంగాభివృద్ధికి ఆజాద్ ఎంత‌గానో కృషి చేశార‌ని కొనియాడారు.


మౌలానా ఆజాద్ స్పూర్తితో విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. అందులో భాగంగానే గ్రామీణ, నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన ఉచిత విద్య అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్న‌ట్లు వివరించారు. ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా ( Advanced Technology Centers - ATCs) అప్ గ్రేడ్ చేశామని తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు ఉపాధ్యాయులు, లెక‌ర్చ‌ర్ల నియామ‌కంతో రాష్ట్రంలో విద్యాభివృద్దికి పాటుప‌డుతున్నామ‌ని పేర్కొన్నారు.


జాతీయోద్య‌మంలో పాల్గొన‌డంతో పాటు అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీకి అధ్య‌క్షునిగా ఆజాద్ ఎన‌లేని సేవ‌లు అందించార‌ని సీఎం కొనియాడారు. ఖిలాఫత్ ఉద్యమములో పాల్గొని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకముగా పోరాడార‌ని గుర్తు చేశారు. జాతీయోద్యమములో హిందూ ముస్లిం ఐక్యతను కోరుకొని దేశ విభజనను వ్యతిరేకించాడని తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం మైనారిటీలకు గొంతుకగా నిలిచారని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

క్వాంటం కంప్యూటింగ్‌ సెంటర్‌గా ఏపీ.. బిలియన్‌ డాలర్ల పెట్టుబడులే లక్ష్యం

తిరుమల కల్తీ వ్యవహారంపై సీబీఐ విచారణ కొనసాగుతోంది: కొమ్మారెడ్డి

Updated Date - Nov 10 , 2025 | 08:16 PM