Yadagirigutta: రథ రూపులుగా యాదగిరి లక్ష్మీనారసింహుల దర్శనం
ABN , Publish Date - Mar 10 , 2025 | 03:49 AM
వేదమంత్రాలతో ఆలయ అర్చకులు రథాంగ హోమం జరిపారు. వేద పారాయణాలు, మూలమంత్ర జపాల అనంతరం స్వామి వారిని భక్త జనులు రథాంగ దర్శనం చేసుకున్నారు. రథస్త కేశవుడిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం.

యాదాద్రి, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో రాత్రి కల్యాణ లక్ష్మీనరసింహులు భక్తజనులకు రథ రూపులుగా దర్శనమిచ్చారు. పట్టువస్త్రాలు, బంగారు, వెండి ఆభరణాలతో అలంకరించిన కల్యాణ దంపతులైన లక్ష్మీనారసింహులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై అధిరోహించారు. వేదమంత్రాలతో ఆలయ అర్చకులు రథాంగ హోమం జరిపారు. వేద పారాయణాలు, మూలమంత్ర జపాల అనంతరం స్వామి వారిని భక్త జనులు రథాంగ దర్శనం చేసుకున్నారు.
రథస్త కేశవుడిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు దంపతులు రథోత్సవాన్ని ప్రారంభించారు. ప్రధానార్చకుడు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు అర్చకబృందం ఉత్సవాలు నిర్వహించారు. ఈవో ఏ. భాస్కర్‌రావు దంపతులు, ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, తదితరులు రథోత్సవంలో పాల్గొన్నారు.