R Krishnaiah: పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి
ABN , Publish Date - May 04 , 2025 | 04:41 AM
పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్ట సభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య వినతి పత్రం అందజేశారు.

ప్రధాని మోదీకిఎంపీ ఆర్. కృష్ణయ్య వినతి పత్రం
రాంనగర్, మే 3 (ఆంధ్రజ్యోతి) : పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్ట సభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య వినతి పత్రం అందజేశారు. జనగణనలో కులగణన చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకున్నందుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేసినట్లు తెలిపారు. విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఆయన శనివారం మాట్లాడుతూ.. ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధానిని తాను కలిసి బీసీల డిమాండ్లపై వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.
దేశ వ్యాప్తంగా 56 శాతం బీసీ జనాభా ఉందని వీరందరికి రాజ్యాంగ పరంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో తగిన వాటాను ఇచ్చేలా కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. బీసీలందరూ చట్టసభల్లోకి రావాలంటే 50 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరినట్లు చెప్పారు. తమ డిమాండ్ల పట్ల ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించినట్లు ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు. 40 ఏళ్లుగా తాను చేస్తున్న బీసీ పోరాటాన్ని ఆయన మెచ్చుకున్నట్లు చెప్పారు.