Rajnath Singh: అల్లూరి గొప్ప పోరాట యోధుడు
ABN , Publish Date - Jul 05 , 2025 | 04:11 AM
బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాలు నిర్వహించిన రాబిన్‌హుడ్ అల్లూరి సీతారామరాజు అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కొనియాడారు.

బ్రిటిషర్లకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం జరిపిన రాబిన్‌హుడ్.. మన్యం వీరుడు
ఆయన ఆశయాలకు అనుగుణంగానే గిరిజనుల సంక్షేమానికి ప్రధాని మోదీ కృషి
అల్లూరి 128వ జయంతి ఉత్సవాల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
హైదరాబాద్, బేగంపేట, జూలై 4 (ఆంధ్రజ్యోతి): బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాలు నిర్వహించిన రాబిన్‌హుడ్ అల్లూరి సీతారామరాజు అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కొనియాడారు. అడవి బిడ్డల కోసం ఆయన గొప్ప పోరాటం చేశారని.. వీరోచిత పోరాటంతో మన్యం వీరుడిగా గుర్తింపు పొందారని ప్రశంసించారు. అల్లూరి ఆశయాలకు అనుగుణంగానే.. ప్రధాని మోదీ గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. క్షత్రియ సేవా సమితి(తెలంగాణ, ఏపీ), భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ శుక్రవారం ఇక్కడ శిల్ప కళావేదికలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 128వ జయంతి ఉత్సవాలకు రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘‘బానిసత్వంతో కాదు. ఆత్మాభిమానంతో బతకాలి’’ అన్న అల్లూరి పిలుపునకు అనుగుణంగా ప్రజలు జీవించాలని సూచించారు. ఆయన పుట్టిన ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని, ఆ ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. నక్సల్స్ ఒకప్పుడు గిరిజన ప్రాంతాలను ఆక్రమించుకునేవారని దుయ్యబట్టిన ఆయన.. నక్సలిజం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఐదారు జిల్లాలకే పరిమితమైందని అన్నారు. 2026 మార్చి 31 నాటికి భారత్ నక్సల్ రహిత దేశం కావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. అలాగే.. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా, హనుమంతుడి స్ఫూర్తితో ఆపరేషన్ సిందూర్ కొనసాగిందని.. అందులో పాక్ పౌర సమాజానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు. ఇక.. ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులకు చరిత్రలో సరైన స్థానం దక్కలేదని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. వారి చరిత్రను సమాజానికి అందించాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి
స్టాక్ మార్కెట్‌లో భారీ కుంభకోణం..జేన్ స్ట్రీట్‌పై సెబీ చర్యలు
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి