Share News

Khammam: మోస్తరు వర్షాలతో పంటలకు ఊపిరి

ABN , Publish Date - Jul 22 , 2025 | 03:55 AM

రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు.. పత్తి, వరి పంటలకు ఊపిరి పోశాయి. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండు ముఖం పట్టాయి.

Khammam: మోస్తరు వర్షాలతో పంటలకు ఊపిరి

  • ఖమ్మం, నల్లగొండ సహా పలు జిల్లాల్లో వాన

  • పినపాకలో పిడుగుపాటుకు మహిళ మృతి

  • శ్రీశైలానికి 1.22 లక్షల క్యూసెక్కుల వరద

  • నేడు గేట్లు తెరిచి నీటిని విడుదల చేసే చాన్స్‌

  • 568 అడుగులకు చేరిన సాగర్‌ నీటి మట్టం

  • నేడు, రేపు భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు.. పత్తి, వరి పంటలకు ఊపిరి పోశాయి. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండు ముఖం పట్టాయి. వర్షాభావ పరిస్థితులతో ఆందోళన చెందుతున్న రైతులు.. తాజాగా కురిసిన వర్షాలతో ఊపిరి పీల్చుకుంటున్నారు. సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసాయి. ఖమ్మం నగరంలో వరద నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. చింతకానిలో 6.2, మధిరలో 5, ఖమ్మం అర్బన్‌లో 4.8, కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో 4.7, బోనకల్లు మండలం రావినూతలలో, ముదిగొండలో 4.5సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బోటిగూడెంలో వరి నాట్లు వేస్తున్న సమయంలో పిడుగుపడడంతో మహిళా వ్యవసాయ కూలీ కొమరం రమణ(55) అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడే పని చేస్తున్న మరో ఇద్దరికి స్వల్ప గాయాలవగా.. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మధిర మండలం మల్లారంలో నల్లవాగు పొంగడంతో ఆరు పాడి గేదెలు గల్లంతయ్యాయి. అలాగే, నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లిలో 10.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌ శివారులోని రాజేంద్రనగర్‌ మైలార్‌దేవ్‌పల్లి, శివరాంపల్లి, బహుదూర్‌పురా, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి.


మైలార్‌దేవ్‌పల్లిలో అత్యధికంగా 6.5, శివరాంపల్లిలో 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాగా, కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని జలాశయానికి 1500క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. నీటి మట్టం 399.40 అడుగులకు చేరింది. కాగా, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా.. శ్రీశైలం ప్రాజెక్టుకు 1.22 లక్షల ఇన్‌ఫ్లో వస్తోంది. కుడి, ఎడమ విద్యుత్‌ కేంద్రాల్లో 67,551 క్యూసెక్కులను వినియోగిస్తుండగా, పోతిరెడ్డి పాడుకు 20 వేల క్యూసెక్కులను విడుదల చేసస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215.18 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 206.97 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో మంగళవారం మరోసారి గేట్లు తెరిచి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరోవైపు.. జూరాలకు 72వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, 8 గేట్లు ఎత్తి 31,464 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మరోవైపు.. నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి 67,551 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 568.30 అడుగుల(252.3 టీఎంసీల) మేర నీరు నిల్వ ఉంది. గోదావరి పరివాహకంలో మేడిగడ్డ బ్యారేజీ వద్ద 1.23 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. కాగా, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో మంగళ, బుధ వారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2025 | 03:55 AM