Aadhaar Authentication: ఆధార్ లేకున్నా తత్కాల్ టికెట్.!
ABN , Publish Date - Jul 19 , 2025 | 05:14 AM
ఆధార్ వివరాలు లేకుండానే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా రైల్వే సిబ్బంది తత్కాల్ టికెట్లను అందిస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 1 నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో తత్కాల్ టికెట్లు

రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో అమలుకాని కొత్త విధానం
సాంకేతిక కారణాలతో తాత్కాలికంగా వాయిదా వేసిన సీఆర్‌ఐఎస్ అధికారులు!
హైదరాబాద్ సిటీ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ఆధార్ వివరాలు లేకుండానే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా రైల్వే సిబ్బంది తత్కాల్ టికెట్లను అందిస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 1 నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో తత్కాల్ టికెట్లు తీసుకునేందుకు ఆధార్ అథంటికేషన్ తప్పనిసరి చేసిన రైల్వే అధికారులు, ఈ నెల 15 తర్వాత రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలోనూ ఆధార్ ఆధారిత ఓటీపీ విధానాన్ని అమలుచేస్తామని ప్రకటించారు. అయితే.. మూడు రోజులుగా రిజర్వేషన్ సిబ్బంది ఆధార్ లేకుండానే టికెట్లు జారీ చేస్తున్నారు. ఆధార్ అథంటికేషన్ ప్రక్రియలో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా కొత్త విధానాన్ని తాత్కాలింగా వాయిదా వేసినట్లు సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సీఆర్‌ఐఎస్) అధికారులు తెలిపారు.
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో అమలవుతున్న ఆధార్ విధానంలోనే అనేక సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, రిజర్వేషన్ కౌంటర్లలోనూ తత్కాల్ టికెట్టుకు ఆధార్ తప్పనిసరి చేస్తే టికెట్ల జారీలో మరిన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని రిజర్వేషన్ సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం ఒక నిమిషంలో నాలుగు టికెట్లు ఇస్తున్నామని, కొత్త విధానంలో ఆధార్ అథంటికేటెడ్ ఓటీపీని నమోదు చేయాల్సి వస్తే ప్రతీ టికెట్టు జారీకి కనీసం 52 సెకన్ల చొప్పున సమయం పడుతుందని అంటున్నారు. టికెట్ జారీలో జాప్యాన్ని నివారించడం సాధ్యం కాకపోవడంతో ఆ పద్ధతిని సీఆర్‌ఐఎస్ తాత్కాలింగా వాయిదా వేసిందని చెబుతున్నారు.