Dog Bite: కరిచిన పెంపుడు కుక్క.. రేబీస్‌తో యజమాని మృతి
ABN , Publish Date - Jul 21 , 2025 | 04:18 AM
ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కే తమ ఇంట్లో విషాదాన్ని నింపుతుందని ఆ కుటుంబసభ్యులు ఊహించలేదు.

సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో ఘటన
మేళ్లచెరువు, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కే తమ ఇంట్లో విషాదాన్ని నింపుతుందని ఆ కుటుంబసభ్యులు ఊహించలేదు. దానిపై దాడి చేసిన వీధికుక్కలను యజమాని తరుముతుండగా పొరపాటున పెంపుడు కుక్క ఆయన్ను కరవడంతో రేబిస్ సోకి మరణించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలం కందిబండ గ్రామంలో జరిగింది. కందిబండ గ్రామానికి చెందిన తాపీ మేస్త్రి డక్కం మధు (42) కొంతకాలంగా ఇంట్లో ఓ కుక్కను పెంచుకుంటున్నారు. గత నెల 20వ తేదీన ఆ కుక్కపై కొన్ని వీధి కుక్కలు దాడిచేశాయి.
వాటిని మధు తరుముతుండగా పొరపాటున పెంపుడు కుక్క ఆయన్ను కరిచింది. వెంటనే ఆయన మేళ్లచెర్వు ప్రాథమిక వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందారు. ఈ క్రమంలో ఆయనకు రేబీస్ సోకింది. వ్యాధి తీవ్రం కావడంతో కుటుంబసభ్యులు ఈ నెల 15వ తేదీన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు ఇంటికి తిరిగొచ్చారు. ఈ క్రమంలో రేబిస్ వ్యాధి ముదిరి శనివారం మధు ఇంట్లోనే మృతి చెందారు.
తూప్రాన్‌లో కుక్కల స్వైరవిహారం
చిన్నారి సహా 10 మందికి గాయాలు
తూప్రాన్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో కుక్కల దాడిలో ఓ చిన్నారి సహా పదిమంది గాయపడ్డారు. పట్టణానికి చెందిన గీత, విశాల్ దంపతుల కుమారుడు అనిరుధ్ (3) ఇంటి ముందు ఆడుకుంటుండగా కుక్క దాడిచేసింది. ఈ దాడిలో అనిరుధ్ కంటికి తీవ్రగాయమైంది. చిన్నారిని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఆదివారం ఒక్కరోజే తూప్రాన్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో కుక్కలు దాడిచేయగా మరో పదిమంది గాయపడ్డారు. వీరందరికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక, టీవీ చానల్
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News