Share News

PV Narasimha Rao: పీవీ విజ్ఞాన వేదిక పూర్తయ్యేదెన్నడు?

ABN , Publish Date - Jun 28 , 2025 | 03:22 AM

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విజ్ఞాన వేదిక నిర్మాణం పనులు ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు.

PV Narasimha Rao: పీవీ విజ్ఞాన వేదిక పూర్తయ్యేదెన్నడు?

  • 4 ఏళ్లుగా సాగుతున్న పనులు

  • వంగరలో మంత్రులు సురేఖ, సీతక్క పర్యటన రద్దు

  • నేడు పీవీ 104వ జయంతి

  • రాజ్‌భవన్‌లో పీవీ చిత్రపటాన్ని ఆవిష్కరించిన గవర్నర్‌

భీమదేవరపల్లి, హైదరాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విజ్ఞాన వేదిక నిర్మాణం పనులు ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. శనివారం పీవీ జయంతి. ఈ సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఆధ్వర్యంలో వంగరలో పీవీ విజ్ఞాన వేదికను ప్రారంభించి, పీవీ జయంతిని ఘనంగా నిర్వహించాలని భావించారు. అయితే పనులు పూర్తికాకపోవడంతో శనివారం జరగాల్సిన మంత్రుల పర్యటన రద్దయింది. వంగరలో రూ.7కోట్లు వెచ్చించి పీవీ విజ్ఞాన వేదిక ఏర్పాటు చేయాలని 2021 జనవరిలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంకల్పించింది. అదే ఏడాది జూన్‌ 28న పీవీ శతజయంతి ఉత్సవాల నాటికి విజ్ఞాన వేదికను పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే నిధుల కొరత కారణంగా ఇప్పటికీ పనులు ముందుకు సాగడం లేదు. పీవీ ధ్యాన మందిరం, పార్కింగ్‌ స్థలం, ఫుట్‌ కోర్టు, పీవీ విగ్రహం ఏర్పాటు, విద్యుద్దీపాల ఏర్పాటు, పిల్లల ఆట స్థలం తదితర పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. కాగా వంగరలో పీవీ 104వ జయంతి వేడుకలు శనివారం నిర్వహిస్తామని పీవీ సోదరుడి కుమారుడు పీవీ మదన్‌మోహన్‌రావు తెలిపారు. కాగా పీవీ జ్ఞానభూమిలో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట దాకా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పీవీ మనుమడు, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎస్వీ సుభాష్‌ వెల్లడించారు. కాగా శనివారం పీవీ జయంతి సందర్భంగా రాజ్‌భవన్‌లో ఆయన చిత్రపటాన్ని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆవిష్కరించారు.


పీవీ సేవలు చిరస్మరణీయం: మోదీ

మాజీ ప్రధాని పీవీ జాతికి అందించిన సేవలు చిరస్మరణీయం అని ప్రధాని మోదీ అన్నారు. దేశం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో ప్రధానిగా ఆ యన కీలక సంస్కరణలు చేపట్టారని వివరించారు. దేశ ఆర్థిక ప్రగతికి ఈ సంస్కరణలు పునాది వేశాయన్నారు. పీవీ చేపట్టిన భూసంస్కరణలు, పరిపాలనపరంగా తీసుకున్న నిర్ణయాలు ఆదర్శప్రాయమని కొనియాడారు.


పీవీ స్ఫూర్తితోనే.. యంగ్‌ ఇండియా గురుకులాలు: రేవంత్‌

పీవీ నరసింహారావు స్ఫూర్తితోనే విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రతి నియోజకవర్గంలో అంతర్జాతీయ విద్యాప్రమాణాలతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్మాణానికి తమ ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొన్నారు. ప్రధానిగా పీవీ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి భారత్‌ను ప్రగతి పథంలో నడిపించారని, ఆర్థిక సంస్కరణలతో దేశ ప్రగతిని పరుగులు పెట్టించారని కొనియాడారు.

Updated Date - Jun 28 , 2025 | 03:22 AM