Share News

District Division: వరంగల్‌.. హనుమకొండ.. రెండు జిల్లాలెందుకు!?

ABN , Publish Date - Jul 29 , 2025 | 05:07 AM

వరంగల్‌ జిల్లా కలెక్టరేట్‌తోపాటు ఇతర కీలక కార్యాలయాలన్నీ హనుమకొండలో ఉన్నాయి! వరంగల్‌ జిల్లావాసులు కలెక్టర్‌ను కలుసుకోవాలంటే హనుమకొండకు రావాల్సిందే.

District Division: వరంగల్‌.. హనుమకొండ.. రెండు జిల్లాలెందుకు!?

  • ఒకే నగరాన్ని 2 జిల్లాలుగా విభజించడమేంటి?

  • వీటి ఏర్పాటుతో ప్రజలకు పెరిగిన కష్టాలు

  • హనుమకొండతో కలిపి వరంగల్‌ను జిల్లాగా కొనసాగించాలి

  • అశాస్త్రీయ విభజనపై మేధావుల నిరసన

  • జిల్లాల ఏకీకరణపై ఉద్యమానికి శ్రీకారం

వరంగల్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వరంగల్‌ జిల్లా కలెక్టరేట్‌తోపాటు ఇతర కీలక కార్యాలయాలన్నీ హనుమకొండలో ఉన్నాయి! వరంగల్‌ జిల్లావాసులు కలెక్టర్‌ను కలుసుకోవాలంటే హనుమకొండకు రావాల్సిందే. వరంగల్‌, హనుమకొండ జిల్లా కార్యాలయాలూ పక్కపక్కనే! మరి, వరంగల్‌, హనుమకొండ.. రెండు జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు ఒరిగిందేమిటి!? ఆ రెండు జిల్లాల ప్రజల్లో ఇప్పుడు ఇదే ప్రశ్న! అందుకే, చరిత్రాత్మక వరంగల్‌ నగరాన్ని రెండు ముక్కలు చేసి.. వరంగల్‌, హనుమకొండ జిల్లాలుగా చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ రెండు జిల్లాలనూ మళ్లీ కలపాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి! ఈ దిశగా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు, విద్యావంతులు, వివిధ పార్టీల నేతలు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. బీఆర్‌ఎస్‌ నేతలు తమ పదవులు, వ్యాపారాల కోసం ఎంతో ఘన చరిత్ర ఉన్న వరంగల్‌ నగరాన్ని రెండుగా విభజించి అభివృద్ధి జరగకుండా కుట్ర చేశారని ఆరోపిస్తూ తెలంగాణ ఉద్యమ వేదిక, ఫోరం ఫర్‌ బెటర్‌ వరంగల్‌ ఆధ్వర్యంలో సదస్సులు, చర్చా వేదికలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల విభజనపై న్యాయ నిపుణులతో కమిటీ వేస్తామని, శాస్త్రీయబద్ధంగా జిల్లాల ఏర్పాటు ఉం టుందని కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, రెండేళ్లు కావస్తున్నా.. ఇప్పటి వరకూ బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం విభజించిన కొత్త జిల్లాలతోనే పాలన సాగుతోందని తప్పుబడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వరంగల్‌ జిల్లాలో హనుమకొండ జిల్లాను విలీనం చేయాలన్న ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు.


ఆరు ముక్కలైన వరంగల్‌ జిల్లా

బీఆర్‌ఎస్‌ సర్కారు వచ్చిన తర్వాత 2016 అక్టోబరు 11న ఉమ్మడి 10 జిల్లాలను 31 జిల్లాలుగా మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. చరిత్రాత్మక వరంగల్‌ జిల్లాను వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, జనగామ జిల్లాలుగా విభజించింది. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 19న భూపాలపల్లి జిల్లాలో తొమ్మిది మండలాలతో రెవెన్యూ డివిజన్‌గా ఉన్న ములుగును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసింది. ఫలితంగా.. వరంగల్‌ జిల్లా ఆరు ముక్కలైంది. అనంతరం, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలను 2021 ఆగస్టు 12న వరంగల్‌, హనుమకొండ జిల్లాలుగా ఏర్పాటు చేసింది. వరంగల్‌ నగరాన్ని రెండుగా చీల్చి రెండుజిల్లాలకు హెడ్‌క్వార్టర్‌ చేసింది. వరంగల్‌ జిల్లాను ఆరు ముక్కలు చేయడంపై అప్పట్లోనే చరిత్రకారులు, తెలంగాణ ఉద్యమకారుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. ప్రధానంగా వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాల విభజనపై ప్రజల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లాకు కనీసం పరిపాలన సాగించేందుకు హెడ్‌క్వార్టర్‌ లేకుండాపోయింది. పాలనాపరమైన కార్యకలాపాలన్నిటికీ ప్రజలు హనుమకొండకు రావాల్సి వస్తోంది. గత ప్రభుత్వ నిర్వాకంతోనే చరిత్రాత్మక ఏకశిలా నగరం రెండు ముక్కలైందనే వాదన ఉంది. పైగా కలెక్టర్‌తోపాటు ఇతర అన్ని శాఖల అధికారులు ఇద్దరిద్దరు ఉండటంతో వారికి చెల్లించే వేతనాలు, సదుపాయాలు, ఇతరత్రా ఖర్చులన్నీ ప్రభుత్వానికి అదనపు భారంగా మారాయి. ఈ నేపథ్యం లో సీఎం రేవంత్‌ రెడ్డి సైతం గత ప్రభుత్వం జిల్లాలను శాస్ర్తీయ పద్ధతిలో విభజన చేయలేదని, త్వరలోనే ఓ కమిటీ వేసి జిల్లాల విభజనపై పరిశీలన చేస్తామని ప్రకటించారు. దాంతో, గతేడాది ఆగస్టులో చేపట్టిన వరంగల్‌, హనుమకొండ జిల్లాల ఏకీకరణ ఉద్యమాన్ని కేయూ ప్రొఫెసర్లు, విద్యార్థులు, విద్యావంతులు, వివిధ పార్టీల నేతలు నిలిపివేశారు. అయితే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంతో మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.


మద్దతుగా ఉద్యమాలు

వరంగల్‌ నగరాన్ని రెండు ముక్కలు చేయడంపై మొదటి నుంచీ కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ, సీపీఎం, న్యూ డెమోక్రసీతోపాటు బీఆర్‌ఎ్‌సలోని ఓ వర్గం, ఇతర సంఘాలు వ్యతిరేకిస్తూ వచ్చాయి. కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సైతం ఈ రెండు జిల్లాల విలీనానికి మద్దతు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, తెలంగాణవాదులు, వివిధ సంఘాల నేతృత్వంలో రెండు వారాలుగా ఉద్యమాన్ని మొదలు పెట్టారు. రెండు జిల్లాల్లోని అన్ని ప్రాంతాల ప్రజల మద్దతును కూడా కట్టి త్వరలోనే సీఎం రేవంత్‌ రెడ్డిని కలుస్తామని కేయూ ప్రొఫెసర్‌ కూరపాటి నారాయణ తెలిపారు.


ఇవి కూడా చదవండి..

కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు, మోదీకి ఫోన్ కాల్ రాలేదు

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 05:07 AM