Share News

Scholarships: నర్సింగ్‌ విద్యార్థుల లబోదిబో!

ABN , Publish Date - Apr 09 , 2025 | 05:01 AM

రాష్ట్రంలో ప్రైవేట్‌ కళాశాలల్లో జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నాలుగేళ్లుగా పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ నిధులు విడుదల కాలేదు.

Scholarships: నర్సింగ్‌  విద్యార్థుల లబోదిబో!

నాలుగేళ్లుగా విడుదల కాని పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షి్‌పలు.. ప్రశ్నార్థకంగా విద్యార్థుల భవిష్యత్తు

  • సుమారు రూ.200 కోట్ల బకాయులు

  • సర్టిఫికెట్లు ఇవ్వని యాజమాన్యాలు

  • త్వరలో నర్సింగ్‌ రాత పరీక్ష ఫలితాలు

  • ఎంపికైతే సర్టిఫికెట్లు తప్పనిసరి.. ఆందోళనలో విద్యార్థులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రైవేట్‌ కళాశాలల్లో జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నాలుగేళ్లుగా పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ నిధులు విడుదల కాలేదు. దాంతో ప్రైవేట్‌ కళాశాలలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ డబ్బులను విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. డబ్బులు కట్టలేక కొందరు మధ్యలోనే చదువు వదిలేస్తున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు అన్ని రకాల కోర్సుల బోధనా రుసుములు రూ.5,500 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో ఒక్క నర్సింగ్‌ విద్యకు సంబంధించిన పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ నిధులే రూ.200 కోట్లు వరకు ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. పెండింగ్‌ బకాయిల కారణంగా చదువు పూర్తి చేసుకున్న వారికి ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు సర్టిిఫికెట్లు ఇవ్వడం లేదు. డబ్బులు కట్టిన విద్యార్థులకే ఇస్తున్నాయు. ప్రభుత్వం నుంచి స్కాలర్‌షిప్‌ వచ్చాక ఆ డబ్బును విద్యార్థులకు తిరిగిస్తామని యాజమాన్యాలు చెబుతున్నాయి. నర్సింగ్‌ కోర్సులో చేరే వారిలో మెజారిటీ శాతం ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారేనని కళాశాలలు చెబుతున్నాయి. దాంతో ఆ డబ్బులు కట్టి రఽధువపత్రాలు తీసుకునే స్తోమత వారికి ఉండడం లేదు. ధ్రువపత్రాలు లేకుండా తమను ఉద్యోగాల్లోకి తీసుకోవడం లేదని ఖమ్మం జిల్లాకు చెందిన మాధవి అనే నర్స్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు గతేడాది మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు 2,300 స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించింది. ఈ నెల 26 వరకు హైదరాబాద్‌లో అమల్లో ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియగానే మెడికల్‌ బోర్డు ఆ పరీక్షా ఫలితాలను విడుదల చేయనుంది. ఆ సమయానికి ఒరిజినల్‌ సర్టిఫికెట్లను సమర్పించ లేకపోతే సెలక్షన్‌ జాబితాలో పేరుండదు. పెండింగ్‌ బకాయిల కారణంగా తమకు ఆ పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.


దీంతో తమ పరిస్థితి ఏమిటని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వైద్య శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 21 ఎంఎస్సీ నర్సింగ్‌ కాలేజీలు, 87 కాలేజీ ఆఫ్‌ నర్సింగ్‌, 161 స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, 112 ఎంపీహెచ్‌డబ్ల్యు ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. మొత్తం 391 కళాశాలల్లో 23 సర్కారీవి కాగా మిగతావన్నీ ప్రైవేట్‌వే. వీటిలో ఏటా 15 వేల మంది వరకు నర్సింగ్‌ సంబంధిత కోర్సుల్లో చేరుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో జీఎన్‌ఎం విద్యార్థులకు హాస్టల్‌తో పాటు మొదటి ఏడాది రూ.5 వేలు, రెండో ఏడాది 6 వేలు, మూడో ఏడాది 7 వేలు, నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థులకు తొలి ఏడాది రూ.5 వేలు ఆ తర్వాత ఏటా వెయ్యి చొప్పున పెంచుకుంటూ పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నారు. ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో సీటు పొందిన వారే స్కాలర్‌షి్‌పకు అర్హులు. ప్రైవేట్‌ కళాశాలల్లోని నర్సింగ్‌ విద్యార్థులకు గత బీఆర్‌ఎస్‌ సర్కారు 2023లో ఈ స్కాలర్‌షి్‌పలను పెంచింది. జీఎన్‌ఎం విద్యార్థులకు రూ.21 వేల నుంచి 30 వేలకు, బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థులకు 24 వేల నుంచి 40-45 వేల వరకు పెంచి, జీవో కూడా విడుదల చేసింది. కానీ ఇంతవరకు ఇది అమలు కాలేదు. పెంచడానికంటే ముందు రెండేళ్ల నుంచి స్కాలర్‌షిప్‌ నిధులు చెల్లించడం లేదని, నాలుగేళ్లుగా స్కాలర్‌షి్‌పలు పెండింగ్‌లో ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్రం ఇచ్చే నిధులకూ రాష్ట్ర ప్రభుత్వంమ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వడం లేదని, రూ.150 కోట్లు రాష్ట్ర సర్కారు ఇస్తే, అక్కడి నుంచి 250- 300 కోట్లు వస్తాయని అధికారులు చెబుతున్నారు.


దశలవారీగా అని చెప్పి కూడా ఇవ్వడం లేదు

24.jpg

పెండింగ్‌ బకాయిల గురించి ఆరు నెలల క్రితం ఆర్థిక మంత్రి భట్టిని కలిశాం. దశలవారీగా కొంచెం కొంచెం విడుదల చేస్తామని హామీనిచ్చారు. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. తిరిగి తిరిగి విసుగు వస్తోంది. 2023 మే, జూన్‌లో విడుదలైన టోకెన్స్‌ కూడా ఇంతవరకు క్లియర్‌ కాలేదు. నాలుగేళ్లుగా జేబులోంచి పెడుతున్నాం. ఇంకా పెట్టాలంటే మావల్ల కావడం లేదు.

- డి. సాంబిరెడ్డి, తెలంగాణ ప్రైవేటు నర్సింగ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ

Updated Date - Apr 09 , 2025 | 05:01 AM